సరస్వతీ మాత విగ్రహం కోహినూర్‌ కన్నా ముఖ్యం | Vagdevi idol more important than Kohinoor petitioners seek its return from London | Sakshi
Sakshi News home page

సరస్వతీ మాత విగ్రహం కోహినూర్‌ కన్నా ముఖ్యం

May 20 2026 4:31 PM | Updated on May 20 2026 5:38 PM

Vagdevi idol more important than Kohinoor petitioners seek its return from London

 లండన్‌ మ్యూజియం నుంచి వెనక్కి తేవాలి 

మధ్యప్రదేశ్‌ హైకోర్టులో హిందూపక్షం పిటిషన్‌  

ఇండోర్‌: వివాదాస్పద భోజ్‌శాల కేసులో విజయం సాధించిన హిందూ పిటిషనర్లు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో మరోసారి పిటిషన్‌ వేశారు. ఆలయంలో ఉండాల్సిన సరస్వతీ మాత ప్రతిమ లండన్‌ మ్యూజియంలో ఉందని, కోహినూర్‌ వజ్రం కంటే ముందు అత్యంత ముఖ్యమైన ఆ విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చేలా ఆదేశాలివ్వాలని అందులో వారు కోరారు. 

భోజ్‌శాల–కమాల్‌ మౌలా మసీదు సముదాయం ఒకప్పుడు సరస్వతీ దేవి ఆలయప్రాంతమని శుక్రవారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. దీంతోపాటు, ఆ ప్రదేశంలో హిందువుల పూజలు, ముస్లింల ప్రార్థనలకు వీలు కల్పిస్తూ ఏఎస్‌ఐ జారీ చేసిన ఉత్తర్వులను సైతం రద్దు చేయడం తెల్సిందే. దీంతో, శనివారం నుంచి అక్కడ సరస్వతీ మాత ప్రతిరూపాన్ని ప్రతిష్టించుకుని హిందువులు పూజలు చేస్తున్నారు. అయితే, అక్కడుండాల్సిన అసలైన విగ్రహం వలస పాలన కాలంలో బ్రిటిషర్లు తీసుకెళ్లి లండన్‌ మ్యూజియంలో ఉంచారని పిటిషనర్లు తెలిపారు. దానిని తిరిగి తీసుకువచ్చి భోజ్‌శాలలో ప్రతిష్టించాలని కోరారు. ఇందుకుగాను బ్రిటిష్‌ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరపవచ్చని కూడా హైకోర్టు 15వ తేదీనాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ

సరస్వతీ మాత విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరినట్లు పిటిషనర్లలో ఒకరైన కుల్దీప్‌ తివారీ చెప్పారు. బ్రిటిష్‌ రాజవంశీకుల దగ్గరున్న కోహినూర్‌ మాదిరిగానే వాగ్దేవి విగ్రహాన్ని కూడా తీసుకురావాలన్నారు. కానీ, కోహినూర్‌ కంటే ఇప్పుడు సరస్వతీ మాత విగ్రహమే ముఖ్యమని, ఇది తమ మతవిశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విషయమని తివారీ పేర్కొన్నారు. రాజకీయ సంకల్పముంటే బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి లండన్‌ నుంచి విగ్రహాన్ని తీసుకురావడం ఏమంత కష్టమైన విషయం కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. 1034లో భోజ్‌శాలలో పర్మార్‌ రాజు భోజుడు సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించారని, 1305లో మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించుకున్న సమయంలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆలయాన్ని ధ్వంసం చేశాడని  పిటిషనర్లు పేర్కొన్నారు.     

ఇదీ చదవండి: రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్‌ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీ

Advertisement
 
Advertisement
Advertisement