న్యూఢిల్లీ: ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ తరుణంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్‌పోర్టుల్లో కఠిన నిఘా
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ ల నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ వద్ద ఆరోగ్య పరిస్థితిని నివేదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ కారణంగా వందలాది కేసులు, 130 కి పైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ, అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
21 రోజుల పర్యవేక్షణ.. ఆ లక్షణాలు ఉంటే ప్రమాదమే!
ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి లేదా అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్వయంగా అధికారులకు సమాచారం అందించాలి. విమానాశ్రయంలో దిగిన తర్వాత 21 రోజుల పాటు ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించుకోవాలి. ఈ మూడు వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించి, తమ అంతర్జాతీయ ప్రయాణ వివరాలను పూర్తిగా వెల్లడించడం చట్టపరంగా తప్పనిసరి.
వ్యాక్సిన్లు పనిచేయవు..
ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ ప్రారంభ లక్షణాలు సాధారణ ఇన్ఫ్లుఎంజా, టైఫాయిడ్, మలేరియాను పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అంతేకాకుండా, అందుబాటులో ఉన్న ప్రామాణిక ఎబోలా వ్యాక్సిన్లు ‘జైర్’ స్ట్రెయిన్‌ను అడ్డుకోవడానికి రూపొందించినవి కావడంతో, ప్రస్తుత కొత్త వేరియంట్‌పై ఇవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో, నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ని ప్రధాన కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్‌పోర్టుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.


