కువైట్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, మంటల కారణంగా ఐదుగురు వ్యక్తులు లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయాన్ని కువైట్ అధికారిక అగ్నిమాపక సంస్థ 'జనరల్ ఫైర్ ఫోర్స్' ధృవీకరించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కువైట్ వార్తా సంస్థ (KUNA) ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
కాగా ఇటీవలి కాలంలో కువైట్లోని నివాస ప్రాంతాలలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.
చదవండి: క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?


