‘గ్రామం చిన్నదైనా....అభివృద్ధిలో పెద్దది’ అనేలా పేరు తెచ్చుకోవడానికిసర్పంచ్ కృషి ఎంతో ఉంటుంది.అలాంటి ఒక సర్పంచి సంగం అర్పితా రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని మల్లారం గ్రామసర్పంచ్‌అర్పితా రెడ్డికి జాతీయ స్థాయిగుర్తింపు వచ్చింది. ‘సాంకేతికతతోగ్రామ అభివృద్ధి’ అంశంపై ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన ‘డిజిటల్ కృషి–సమృద్ధి గావ్’ జాతీయస్థాయి పోటీలో గ్రామాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు అర్పితారెడ్డి....
పారిశుధ్యం నుంచి డిజిటలీకరణ వరకు అన్ని రకాలుగా మల్లారం గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి. గ్రామంలో ΄పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఇంటివారు తడి–పొడి చెత్త వేరు చేసుకునే విధానాన్ని అలవాటు చేశారు. పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేస్తూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోనే ఇప్పటి వరకు ఏ సర్పంచ్ చేయని విధంగా గ్రామ పూర్తి సమాచారం, ప్రభుత్వ పథకాలతో గ్రామ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
పన్నుల చెల్లింపులు, ధ్రువపత్రాల జారీ, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఆన్‌లైన్‌లో అందించడంతో ప్రజలకు చాలా సౌకర్యంగా మారింది. గ్రామస్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలో భద్రతను మెరుగు పరిచేందుకు 21 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
యువత కోసం ఓపెన జిమ్ ప్రారంభించారు. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఒక టీచర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ మహిళ గ్రామాభివృద్ధిలో భాగమయ్యేలా మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి.
బాధ్యత పెరిగింది
గ్రామస్థులలో బాధ్యత పెరిగింది. పారిశుధ్యం, పచ్చదనం, గ్రామ అభివృద్ధి గురించి అందరూ చైతన్యంతో ముందుకు వస్తున్నారు. యువత కూడా గ్రామ అభివృద్ధిలో΄ పాల్గొనడం ఆనందంగా ఉంది. మల్లారం గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మహిళా సంఘాలు, యువత భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఇంటికి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం.
– అర్పితారెడ్డి
– ఎస్.డి.తాహెర్ పాషా, పుట్టపాక లక్ష్మణ్, సాక్షి, వేములవాడ
(చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...)


