"ఏవియేషన్‌ రంగానికి చిరునామాగా హైదరాబాద్‌" | Southwest Airlines Opens First Global Innovation Centre in Hyderabad | Sakshi
Sakshi News home page

"ఏవియేషన్‌ రంగానికి చిరునామాగా హైదరాబాద్‌"

May 20 2026 5:11 PM | Updated on May 20 2026 5:29 PM

Southwest Airlines Opens First Global Innovation Centre in Hyderabad

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ జీఐసీ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: వైమానిక, అంతరిక్ష, రక్షణ, డీప్‌టెక్‌ రంగాల్లో హైదరాబాద్‌ వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. అమెరికా విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌ (జీఐసీ)ని ఏర్పాటు చేయడం కూడా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు.

హైటెక్‌ సిటీ ప్రాంతంలో బుధవారం సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ జీఐసీ కేంద్రాన్ని ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ పాతికేళ్ల క్రితమే దేశంలోనే తొలి విమానాశ్రయ నిర్మాణానికి పీపీపీ మోడల్‌ను ఎంచుకోవడంతో హైదరాబాద్‌లో వైమానిక రంగానికి పునాది పడిందని తెలిపారు. డీఆర్‌డీవో, ఆర్‌సీఐ, డీఎంఆర్‌ఎల్‌ వంటి దిగ్గజ రక్షణ రంగ సంస్థలకు కేంద్రమైన హైదరాబాద్‌ అత్యాధునిక ఇంజినీరింగ్‌, సృజనలకు కేంద్రంగా అవతరిస్తోందని అన్నారు. గత ఏడాది కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలు బోలెడు హైదరాబాద్‌లో తమ తొలి ఇన్నొవేషన్‌ సెంటర్ ఏర్పాటు చేశాయని అన్నారు.

సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఎగ్జిక్యుటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ లారెన్‌ వుడ్స్‌ మాట్లాడుతూ... ‘‘ఇంజినీరింగ్‌, అనలిటిక్స్‌, ఇన్నొవేషన్లకు సంబంధించినంత వరకూ హైదరాబాద్‌లో అద్భుతమైన నైపుణ్యం అందుబాటులో ఉంది. అందుకే మేము మా తొలి ఇన్నొవేషన్‌ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము’’ అని వ్యాఖ్యానించారు. ఏఐ, డేటా, నెక్స్ట్‌ జనరేషన్‌ ఇంజినీరింగ్‌లతోపాటు బిజినెస్‌ ఆపరేషన్లను కూడా ఈ కేంద్రం నుంచి నడపనున్నట్లు తెలిపారు.

వెయ్యి మందికి కొలువులు...
సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ జీఐసీలో ప్రస్తుతం 170 మంది పనిచేస్తూండగా.. దశలవారీగా వెయ్యి మంది వరకూ ఉద్యోగాలు పొందుతారని సంస్థ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ లారెన్‌ వుడ్స్‌ ‘సాక్షి.కాం’కు తెలిపారు. ఈ కేంద్రంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే ఉద్యోగాలు పొందుతారని, ప్రస్తుతానికి విదేశీయులను నియమించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని యూనివర్శిటీలు, తెలంగాణ ప్రభుత్వ స్కిల్‌ వర్శిటీతోనూ కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దాదాపు పదేళ్లుగా మెషీన్‌ లెర్నింగ్‌పై దృష్టి పెట్టిందని, సంస్థ కార్యకలాపాల నిర్వహణలో ప్రస్తుతం ఏఐ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ జీఐసీ ద్వారా సమీప భవిష్యత్తులోనే మరిన్ని ఉపయోగకరమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామన్నారు.

తొలి టికెటింగ్‌ మెషీన్‌ మాదే..
సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో సృజనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తామని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్‌ టికెటింగ్‌ మెషీన్‌ను వినియోగించిన సంస్థ తమదేనని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ హెడ్‌ (ఇండియా) కల్లెపల్లి కృష్ణ తెలిపారు. 1971లో ఈ టికెటింగ్‌ మెషీన్‌ను ప్రారంభిస్తే 1994లోనే అత్యాధునిక రిజర్వేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ భవిష్యత్తులో భారత్‌లోనూ ఎగిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ అనేది ప్రస్తుతం ఏ కంపెనీకైనా ఇతర కంపెనీలపై అడ్వాంటేజ్‌ ఇచ్చేదేనని, అందుకే సౌత్‌వెస్ట్‌ కూడా ఈ రంగంలో తగిన చర్యలు తీసుకుంటోందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement