ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బాంబే’ (ఐఐటీ-బీ) తన సత్తాను చాటుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్లేస్‌మెంట్ నివేదికను ఐఐటీ బాంబే తాజాగా విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మొత్తం ఉద్యోగ ఆఫర్ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ విద్యార్థులకు లభించిన సగటు, మధ్యస్థ వేతన ప్యాకేజీలు మాత్రం 10 శాతానికి పైగా పెరగడం విశేషం. జులై 2024 నుంచి జూన్ 2025 మధ్య రెండు విడతలుగా ఈ ప్లేస్‌మెంట్ ప్రక్రియ సాగింది.
తగ్గిన ఆఫర్లు.. పెరిగిన డిమాండ్
ఈ ఏడాది ప్లేస్‌మెంట్ సీజన్‌లో విద్యార్థులు మొత్తం 1,422 ఉద్యోగ ఆఫర్లను అంగీకరించారు. ఇందులో అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్ చేసిన 65 గ్లోబల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐఐటీ-బీలో ఈసారి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య స్వల్పంగా 2% పెరిగి 2,469 కి చేరింది. వీరిలో 2,040 మంది విద్యార్థులు రెండు దశల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. అయితే, కొన్ని గ్లోబల్ కంపెనీలు నియామకాల్లో ఆచితూచి వ్యవహరించడంతో మొత్తం ఆఫర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 3.5% మేర తగ్గింది. భారీ ప్యాకేజీలు సాధించిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగం సాధించిన వారి సగటు వార్షిక వేతనం రూ.26.45 లక్షలుగా ఉంది.
రంగాల వారీగా నియామకాలు
ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు ఎప్పటిలాగే సింహభాగాన్ని ఆక్రమించగా.. కన్సల్టింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ రంగాలు గట్టి పోటీనిచ్చాయి.
| రంగం | కంపెనీల సంఖ్య | లభించిన ఆఫర్లు |
|---|---|---|
| ఇంజినీరింగ్ విభాగం | 96 | 429 |
| ఐటీ | 124 | 393 |
గమనిక: ఐటీ రిక్రూటర్లలో 99 కంపెనీలు కేవలం కోర్ సాఫ్ట్‌వేర్ పాత్రల కోసమే విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.
బీటెక్, కంప్యూటర్ సైన్స్‌దే జోరు
కోర్సుల వారీగా చూస్తే బీటెక్, డ్యూయల్ డిగ్రీ విద్యార్థులకు కంపెనీల నుంచి భారీ డిమాండ్ వ్యక్తమైంది. బీటెక్‌కు సంబంధించి దాదాపు 82 శాతం ప్లేస్‌మెంట్ రేటు నమోదైంది. డ్యూయల్ డిగ్రీ పరంగా 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.
72 శాతానికి పైగా ఎంటెక్ విద్యార్థులు ప్లేస్‌మెంట్లు పొందారు. అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రిజిస్టర్ చేసుకున్న 277 మంది విద్యార్థులలో 258 మంది అత్యుత్తమ ప్యాకేజీలు పొందారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు కూడా మెరుగైన ప్లేస్‌మెంట్ గణాంకాలను నమోదు చేశాయి.
పీహెచ్‌డీల చూపు.. స్టార్టప్‌ల వైపు!
ఇతర రెగ్యులర్ కోర్సులతో పోలిస్తే పీహెచ్‌డీ విద్యార్థుల ప్లేస్‌మెంట్ గణాంకాలు తక్కువగా ఉన్నాయి. అయితే దీనికి కారణం ఉద్యోగాలు లేకపోవడం కాదు; గ్రాడ్యుయేటింగ్ పరిశోధకులు కార్పొరేట్ ఉద్యోగాల కంటే పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌లు, సొంతంగా స్టార్టప్ వెంచర్లను ప్రారంభించడానికే మొగ్గు చూపడం వల్లనేనని నివేదిక స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!


