సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం.
మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు.
ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?
మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే.
చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్‌మెన్‌ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్‌లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?.
వేళ్లన్నీ చంద్రబాబు వైపే..
వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్‌మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్‌బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్‌మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.
పింగళి దశరథ్‌రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్‌కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్‌కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం.
జగన్ నైజం ఇది..
జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు.


