వెంకటలక్ష్మి తమ్ముడి పిల్లలు
బతుకుబండిని లాక్కొస్తున్న వెంకటలక్ష్మి
ఆటో నడుపుతూ కుటుంబ పోషణ
కష్టాలను దాటుకుంటూ పయనం
వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు
పిఠాపురం: సమాజంలో చాలామంది చిన్న కష్టానికే తల్లడిల్లిపోతారు. దాన్ని అధిగమించలేక బెంబేలెత్తిపోతారు. కానీ కొందరు మాత్రం ధైర్యంగా కష్టాలకు ఎదురు నిలిచి ముందుకు సాగుతారు. మిలిగిన వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. పిఠాపురంలోని ఇందిరా నగర్‌కు చెందిన చాట్ల వెంకటలక్ష్మి ఆ కోవలోకే వస్తారు. ధైర్యంగా ఆటో నడుపుతూ తన పిల్లలతో పాటు తమ్ముడి పిల్లలకు కూడా తల్లిగా మారారు. వివరాల్లోకి వెళితే.. వెంకటలక్ష్మి జీవితం భర్త, ఇద్దరు పిల్లల (పాప, బాబు)తో ఉన్నంతలో సంతోషంగా గడిచిపోయేది. కానీ భర్త ఉన్నట్టుండి భార్యాపిల్లలను వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో జీవితం శూన్యంగా మారింది. ఆమె పెద్దగా చదువుకోలేదు. ఉద్యోగం వచ్చే అవకాశమూ లేదు.
కూలి పని చేసుకుని పిల్లలను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టకాలంలోనూ ఆమె ధైర్యాన్ని కూడగట్టుకుంది. కష్టబడి తన పిల్లలను పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాలనుకుని, ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించింది. తక్కువ సమయంలో మెళకువలు నేర్చుకుని చక్కగా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టింది. పాప, బాబులను పెంచుకుంటూ ముందుకు సాగిపోయింది. ఈ సమయంలోనే మరోసారి విధి ఆమెతో ఆడుకుంది. ఆమె తమ్ముడు దంగేటి సత్యనారాయణ, మరదలు లక్ష్మి మృతి చెందడంతో వారి ఇద్దరు పిల్లల భారం కూడా పడింది.
అయినా కుంగిపోకుండా, ఆటో నడుపుతూ నలుగురు పిల్లలనూ పోషించుకుంటూ బతుకు బండిని లాక్కోస్తోంది. తమ్ముడి కుమార్తెల్లో మహాశ్రీ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మానసిక దివ్యాంగురాలైన చిన్న కుమార్తె శ్రీవల్లి స్థానిక భవిత స్కూల్లో చదువుతోంది. అయితే తిండి, ఇతర ఖర్చులను ఆటో ద్వారా వస్తున్న ఆదాయంతో నెట్టుకొస్తున్నా, పిల్లల చదువులకు మాత్రం ఆర్థికంగా వెంకటలక్ష్మి ఇబ్బంది పడుతోంది. సొంతిల్లు కూడా లేని తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది.


