
హోటల్ సిబ్బందిపై దగ్గుపాటి అనుచరుల వీరంగం
అప్పటికప్పుడు పోలీసులతో హోటల్‌పై రైడింగ్
ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులనూ ఉసిగొలి్పన వైనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఎమ్మెల్యే మనుషులొస్తే రూములు లేవంటారా.. ఎంత ధైర్యం మీకు.. ఇకపై మీరు హోటల్ ఎలా నడుపుతారో చూస్తాం’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులతో మాట్లాడుకోవడానికి సూట్‌రూమ్ కావాలని తన ముఖ్య అనుచరుడిని నగరంలోని అలెగ్జాండర్ హోటల్‌కు పంపించారు. అయితే హోటల్ మేనేజర్ రూములు ఖాళీగా లేవని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు పరుష పదజాలంతో మేనేజర్‌పై విరుచుకుపడ్డారు. మెడపట్టి గెంటినట్టు బాధిత సిబ్బంది చెప్పారు.
ఇవన్నీ సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. గొడవ సమయంలో హోటల్‌లో ఎమ్మెల్యే అనుచరులు గంగారాం, పి.హరిక్రిష్ణ ఉన్నట్టు సీసీ ఫుటేజీల్లో తేలింది. ఆ సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి హోటల్ బయట కారులోనే ఉన్నారు. మేనేజర్‌ను కారులో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే సైతం తీవ్ర పదజాలంతో దూషించినట్టు బాధితులు చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే అడిగితే సూట్‌రూం ఇవ్వవా.. నీకెంత ధైర్యంరా.. ఏమనుకుంటున్నావ్ నా గురించి’ అంటూ తిట్టడమే కాకుండా ఇకపై హోటల్ ఎలా నడుపుకుంటారో చూస్తా అంటూ బెదిరించినట్లు తెలిసింది. నాలుగేళ్ల పాటు సూట్‌రూమ్ ఫ్రీగా ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం.
ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి..
పోలీసుల సోదాలు ముగిసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎమ్మెల్యే నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో ముగ్గురు ఆ శాఖ అధికారులు హోటల్‌లో సోదాలకు వెళ్లారు. కిచెన్‌లో ఆహార పదార్థాలను పరిశీలించారు. చికెన్ నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ల్యాబుకు పంపిస్తున్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఇక.. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయాన్నే మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఉసిగొలి్పనట్లు తెలిసింది. హోటల్ భవన నిర్మాణం అక్రమంగా ఉందని, తనిఖీలకు వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో లిక్కర్ వ్యాపారి (సింధూర వైన్స్) పిట్టు రామలింగారెడ్డిపై కూడా దగ్గుపాటి ప్రసాద్ దాడికి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.
పది నిమిషాల్లోనే పోలీసుల రైడింగ్
ఈ ఘటన జరిగిన పది నిమిషాల్లోనే ఎమ్మెల్యే.. టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌కు ఫోన్ చేసి హోటల్‌పై రైడ్ చేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పోలీసులు హోటల్‌కు చేరుకున్నారు. ప్రతి రూము గాలించారు. చిన్న తప్పు కనిపించినా కేసు బుక్ చేయాలని శతవిధాలా యతి్నంచారు. అయితే, చివరకు ఏ లోపం కనిపించకపోవడంతో పోలీసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. తొలుత హోటల్‌లో రైడ్ చేయలేదని చెప్పిన సీఐ శ్రీకాంత్ యాదవ్.. మళ్లీ కొద్ది సేపటికే అన్ని హోటళ్లలాగే ఇక్కడ చేశామని ‘సాక్షి’తో చెప్పడం
గమనార్హం.