సాక్షి,కృష్ణా:గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయమైంది. గత ఏడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు స్వామివారికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే, దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు.
మొదట పాలకవర్గం కిరీటం బ్యాంక్ లాకర్లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు.
దాంతో సుబ్బారావు కిరీటం ఉందా? లేక అమ్మేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకే వెళ్లమని సూచించారని సుబ్బారావు వాపోయారు.


