సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి దుబారా ఖర్చులకు తెరతీశారు. తన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను తానే అమలు చేయడం లేదు. వచ్చే నెల జూన్ 13 నుండి 16 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు లోకేష్ కూడా సింగపూర్‌కి వెళ్లనున్నారు.
ఇటీవల పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై చంద్రబాబు స్పందించారు. కేబినెట్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించాలని, నేతలు వినియోగిస్తున్న వాహనాల సంఖ్యను తగ్గించాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు వద్దని అన్నారు.
కానీ చంద్రబాబు మోదీ సూచనలను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, లోకేష్‌తో పాటు ఇతర నేతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను వినియోగిస్తూ దుబారా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్‌లు సింగపూర్ పర్యటనతో మేమింతే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను పాటించని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్‌కు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటన నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓవైపు చంద్రబాబు,నారా లోకేష్ ఇలా ఉంటే.. కూటమి ఎమ్మెల్యేలు సైతం సోకుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
రాష్ట్రంలో ‘నో వెహికల్ డే’పై విమర్శల మోత
ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో చంద్రబాబు ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’ పాటించాలని ఆదేశించినా, ఆ నిర్ణయం అమలులోనే అభాసుపాలు అవుతున్నాయి.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో భూగర్భ ఘనంగా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన సందర్భంగా భారీ కాన్వాయ్‌తో ప్రయాణించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. పత్తికొండ నుండి జియో మైసూర్ గోల్డ్ పరిశ్రమకు ఆయన కాన్వాయ్ వెళ్ళగా, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇదేనా పొదుపు?అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా
రంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే శిరీషా రాణి అధికారిక పర్యటన సందర్భంగా కాన్వాయిలో ఒక్క వాహనం కూడా తగ్గకుండా ప్రయాణించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. తిమ్మాపురం గ్రామంలో పలు పార్టీ కార్యక్రమాలకు ఆమె వాహనాల కాన్వాయ్‌తోనే హాజరయ్యారు. సీఎం ఆదేశాలను లెక్కచేయకుండా ఎమ్మెల్యే కాన్వాయ్‌తో రావడం చూసి ప్రజలు ఇదేనా పొదుపు?అని ప్రశ్నిస్తున్నారు.
నంద్యాల జిల్లా
డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ‘నో వెహికల్ డే’ ఆదేశాలను తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ప్రయాణం చేస్తానంటూ పోస్టర్లు వేయించి, వాస్తవానికి కార్లలోనే తిరుగుతున్న ఆయన ప్రవర్తన ప్రజల్లో అసంతృప్తిని రేపింది. ఇంధన పొదుపు పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అమలులో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.


