భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్పందించిన టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని సెటైర్ వేశాడు. తాజాగా అఫ్రిది వ్యాఖ్యలపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీనియర్ ఆటగాళ్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలు ఘాటుగా స్పందించారు. ‘అతనెవరు. అతనికంతా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది. అలాంటి వారికి మనం అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సింది కాదు’ అని కపిల్ దేవ్ అఫ్రిది వ్యాఖ్యలను ఉద్దేశించి మండిపడ్డారు. కశ్మీర్ ఎప్పటికి భారత్‌లో అతర్భాగమేనని, కశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాక్ అక్రమించిందని కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు.