సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రణరంగానికి తెరలేచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో సమావేశం కానున్నారు. కాకినాడలో నేడు జరగనున్న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని ఎన్నికల విశ్లేషకులు భావిస్తారు. ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా దిగ్విజయమేనని గోదావరి ప్రజల నమ్మకం. ఎన్నికల సమర శంఖారావం సభకు కాకినాడ వేదిక కావడం శుభసంకేతమని వైఎస్సార్‌సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.