చావబాది.. జాతీయగీతం పాడాలంటూ..

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్ట అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికి హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రగాయాలపాలైన వారి కుటుంబాలు ఆ బాధనుంచి తేరుకోలేకపోతున్నాయి. దానికి తోడు దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం వైరల్‌ కావటం కలకం రేపుతోంది. తాజాగా ఫైజన్‌ అనే ఓ 23ఏళ్ల వ్యక్తిని పోలీసులు హింసిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తీవ్రగాయాలతో నేలపై పడి ఉన్న ఓ నలుగురు వ్యక్తులను జాతీయ గీతం పాడాలంటూ పోలీసులు హింసించటం. వారి చుట్టూ మూగి కర్రలతో వారిని కొడుతూ  బెదిరించటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్ర గాయాలపాలైన ఫైజన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో తీవ్ర దుమారం చెలరేగింది.

దీనిపై అతడి తల్లి స్పందిస్తూ.. ‘ మా ఫైజన్‌తో పాటు మరికొంతమందిని బాగా కొట్టారు. ఫైజన్‌ను ఇనుప రాడ్లతో చితకబాదారు. కాళ్లు విరిగి పోయాయి. దెబ్బల కారణంగా అతడి శరీరం నల్లగా కమిలిపోయింది. మొదట అతడ్ని రోడ్డపై పడేసి కొట్టారు. తర్వాత అక్కడినుంచి తీసుకుపోయారు. ఆ విషయం నాకు తెలియదు. ఆ సాయంత్రం ఫైజన్‌ను కొట్టారని తెలిసి ఆసుపత్రికి వెళ్లాను. అతడక్కడ లేడు. వెంటనే జ్యోతి కాలనీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాను. 

అక్కడ నా కుమారుడ్ని గుర్తుపట్టి పోలీసులకు చూపించాను. అతడ్ని రిలీజ్‌ చేయమని ప్రాధేయపడ్డాను. వాళ్లు ఒప్పుకోలేదు. కలవనివ్వలేదు. రాత్రి ఒంటి గంట వరకు ఎదురు చూశాను. మరుసటి రోజు ఉదయం మళ్లీ పోలీస్‌ స్టేషన్‌ను వెళ్లాను. అప్పుడు వాళ్లు నన్ను బెదిరించారు. చివరకు ఫైజన్‌ చనిపోయే సమయంలో మాకు సమాచారం ఇచ్చారు. నేను వెంటనే అతడ్ని ఆసుపత్రికి  తరలించాను. అక్కడ చికిత్స పొందుతూ ఫైజన్‌ చనిపోయాడు. అసలు అతడు ఆ దాడుల్లో పాల్గొనలేద’ ని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ మారణకాండలో దాదాపు 42మంది చనిపోగా 300మంది తీవ్రగాయాల పాలయ్యారు. దాడులతో సంబంధం ఉన్న 500మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top