ముంబైపై విజయానికి కారణం అదే: సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబైపై విజయానికి కారణం అదే: సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Apr 2 2024 7:30 PM

IPL 2024: Post RR's Win On MI, Sanju's Game-Changer Comment Stuns Everyone

ఐపీఎల్‌-2024లో హ్యాట్రిక్‌ విజయాలతో జోష్‌లో ఉన్నాడు రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రాయల్స్‌ను గెలిపించి పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు.

కాగా ఈ ఎడిషన్‌లో తొలుత లక్నో సూపర్‌ జెయింట్స్‌.. అనంతరం  ఢిల్లీ క్యాపిటల్స్‌పై.. తాజాగా ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది రాజస్తాన్‌ రాయల్స్‌. వీటిలో ముంబైపై విజయం రాయల్స్‌కు ప్రత్యేకం. ఎందుకంటే ముంబైతో గత ఐదు మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే గెలిచిన రాజస్తాన్‌.. ఆరో మ్యాచ్‌లో గెలిచి ఎట్టకేలకు అంతరాన్ని తగ్గించుకోగలిగింది.

ముంబైని సొంత మైదానంలోనే ఓడించి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో విజయానంతరం సంజూ శాంసన్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్‌ గెలవడం తమ విజయానికి దోహదం చేసిందని పేర్కొన్నాడు.

‘‘ఈ మ్యాచ్‌లో టాస్‌ గేమ్‌ చేంజర్‌. ఈ వికెట్‌పై తొలుత బ్యాటింగ్‌ చేయడం కష్టమే. తమ అనుభవంతో బౌల్ట్‌, బర్గర్‌ మా పని సులువు చేశారు. 10- 15 ఏళ్లుగా ఆడుతున్న బౌల్ట్‌ కొత్త బంతితో ఏం చేయగలడో మరోసారి నిరూపించాడు. 

ఆరంభంలోనే 4-5 వికెట్లు పడాలని కోరుకోవడం అతిశయోక్తి లాంటిదే. అయితే.. మా బౌలర్లు మా అంచనాలను నిజం చేశారు. మా జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు. 

అశ్‌, చహల్‌ కీలక సమయంలో వికెట్లు తీస్తారు. గత మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న చహల్‌.. ఈసారి మరింత గొప్పగా ఆడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు’’ అని రాజస్తాన్‌ బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రాజస్తాన్‌.. ముంబై ఇండియన్స్‌ను 125 పరుగులకు కట్టడి చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌(3/22) అద్భుత స్పెల్‌తో ఆకట్టుకోగా.. చహల్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. నండ్రీ బర్గర్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఇక సంజూ శాంసన్‌ బ్యాటర్‌గా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 10 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులే చేశాడు. రియాన్‌ పరాగ్‌ అద్భుత అజేయ అర్ధ శతకం(39 బంతుల్లో 54)తో రాజస్తాన్‌ను గెలిపించాడు. ఆరు వికెట్ల తేడాతో ముంబైని ఓడించిన రాజస్తాన్‌ రాయల్స్‌ తదుపరి.. శనివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనుంది.

IFrame

Advertisement