తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చూపిన బాటలో పయనిస్తూ ఆమె ఆశయాలను నెరవేరుస్తానని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. తన జీవితాన్ని అన్నాడీఎంకేకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా జయలలిత వినియోగించిన కారులోనే, ఆమెలానే ఆకుపచ్చ చీర ధరించి పోయెస్ గార్డెన్ నుంచి శశికళ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెకు సీఎం పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఆహ్వానం పలికారు. ముందుగా ప్రాంగణంలోని ఎంజీ రామచంద్రన్(ఎమ్జీఆర్) విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం ప్రధాన కార్యదర్శిగా శశకళ బాధ్యతలు చేపట్టారు.