జగన్‌కు మద్దతుగా దీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షకు సీమాంధ్రలోని సమైక్యవాదులు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వివిధ ప్రాంతాల్లో ఆయనకు మద్దుతుగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అలాగే పలు పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్కు మద్దతుగా నగర ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన ఫోటోలు పట్టుకుని సమైక్యవాదులు తిరుపతి పుర వీధుల్లో జగన్కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు నినదించారు. సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని వారు హెచ్చరించారు.

జగన్ దీక్షకు మద్దతుగా మదనపల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. అదే జిల్లాలోని పుంగనూరులో ముస్లిం సోదరులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సత్యవేడులో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్షకు కుర్చున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేటలో ఆ పార్టీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు పునుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు దీక్ష చేపట్టారు.

కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఆ పార్టీ నేత సౌమ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. అదే జిల్లాలోని ఆత్మకూరులో జగన్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తులు నిరాహార దీక్ష చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లో వైఎస్ జగన్ అభిమానులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలో కూడా జగన్కు సంఘీభావంగా పలువురు ఆమరన నిరాహార దీక్ష చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఆ పార్టీ రూరల్ మహిళ అధ్యక్షురాలు పీల మహాలక్ష్మి ఆధ్వరంలో దీక్ష ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పలువురు జగన్కు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top