ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి పథకం మార్గదర్శకాలను ప్రకటించింది. ఎంసెట్‌లో అయిదు వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు మాత్రమే పూర్తి రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హులుగా తేల్చింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ర్యాంకుతో సంబంధం లేకుండా పథకాన్ని వర్తింపజేయనుంది. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు, కార్పొరేట్ కాలేజీ స్కీమ్ కింద చదివే విద్యార్థులు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హులవుతారు. 5 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు కాకుండా మిగతా వారికి.. ఆయా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.35 వేల ఫీజు లేదా కాలేజీ ఫీజు (ఏది తక్కువ అయితే అది) ప్రభుత్వం అందజేయనుంది.