ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కౌన్సిల్కు బుధవారం పంపించారు. గత జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే కేజ్రీవాల్ రాజీనామా చేస్తానంటే అయితే అప్పుడు అందరూ వ్యతిరేకించినట్లు ఆప్ నేత అశుతోష్ తెలిపారు. మరోవైపు అంతర్గత కలహాల నేపథ్యంలో ఆప్ ఇవాళ నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ భేటీకి కేజ్రీవాల్ హాజరుకావడం లేదు. అనారోగ్యం కారణంగా ఈ భేటీకి రాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ సమాచారమిచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పది రోజులపాటు నేచురోపతి చికిత్స తీసుకునేందుకు ఆయన బెంగళూరు వెళ్లనున్నారని తెలిపాయి. ఒత్తిడి కారణంగా కేజ్రీవాల్ దేహంలో షుగర్ స్థాయి బాగా పెరిగిందని, మాత్రలు, ఇన్సులిన్ తీసుకున్నా.. నియంత్రణలోకి రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ఇంటిపోరుతో అతలాకుతలమవుతోన్న ఆప్ నాయకత్వం జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి ఉద్వాసన పలకడానికి అరవింద్ కేజ్రీవాల్ వర్గం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.