తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వల్లే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చెప్పారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈ సాయంత్రం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని కోమటిపల్లి గ్రామం చేరుకున్నారు. షర్మిల ఇప్పటి వరకు 2819.2 కిలోమీటర్లు నడిచి చరిత్ర సృష్టించారు. కోమటిపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కోతల ప్రభుత్వం అని విమర్శించారు. అదిచేస్తాం, ఇది చేస్తామని చెబుతారని, అన్ని పథకాలకు కోతలు పెడుతూ ఉంటారని చెప్పారు. అబద్దపు కేసులుపెట్టి జగనన్నను జైలు పాలు చేశారన్నారు. వీరి కుట్రలు ఎంతోకాలం సాగవని చెప్పారు. జగనన్న ఏ తప్పు చేయలేదని, త్వరలోనే బయటలకు వస్తారని చెప్పారు.