రితేష్‌ ఔట్‌! | - | Sakshi
Sakshi News home page

రితేష్‌ ఔట్‌!

Jun 3 2026 1:39 AM | Updated on Jun 3 2026 1:39 AM

రితేష్‌ ఔట్‌!

ధనమేలే అన్నింటికీ మూలం

సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వారసత్వానికి బ్రేక్‌లు పడ్డాయా? నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డిని పక్కన పెట్టారా? మాజీ ఎమ్మెల్యే విజయమ్మ శకం బద్వేల్‌లో ముగిసిందా అంటే ఔను అనే రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఏకులా వచ్చిన డీసీసీబ్యాంకు చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి మేకులా తయారయ్యారు. మొన్న మహానాడు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన అధిష్టానం, నిన్న బూత్‌ లెవెల్‌ ఏజంట్ల నియామక బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు చీఫ్‌ ఎలెక్షన్‌ ఆఫీసరు, డిస్ట్రిక్ట్‌ ఎలెక్షన్‌ ఆఫీసర్‌కు టీడీపీ లేఖ రాసింది.

● తెలుగుదేశం పార్టీలో దివంగత బిజివేముల వీరారెడ్డిది అత్యున్నత క్రియాశీలక పాత్ర. ఒకదశలో ఎన్టీయార్‌ నిర్ణయాలను ధిక్కరించిన వ్యక్తి. టీడీపీ సంక్షోభంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వానికి అండగా నిలిచిన మొదటి నేత. అలాంటి కుటుంబం రాజకీయ నాయకత్వానికి తాజాగా టీడీపీలో బ్రేకులు పడ్డాయి. ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, మనవడు రితేష్‌రెడ్డిల ప్రమేయాన్ని బద్వేల్‌లో కట్టడి చేశారు. ఇన్‌చార్జి నుంచి అధికారికంగా తప్పించడమే తరువాయి. ఇటీవల మహానాడు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి డీసీసీబీ చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారంతో మొదలై ప్రస్తుతం బీఎల్‌ఏ నియామకంపై అధికారికంగా టీడీపీ ఎన్నికల అధికారులకు లేఖ జారీ చేసింది. ఇకపై సూర్యనారాయణరెడ్డిని నియమించిన వారినే టీడీపీ బీఎల్‌ఏలుగా పరిగణించాల్సిందిగా నిర్ణయించారు.

‘ధనం మూలం ఇదం జగత్‌’ అన్నట్లుగా 2014–19వరకూ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానికి సాధారణ అనుచరుడుగా ఉన్న మంచూరు సూర్యనారాయణరెడ్డి కాంట్రాక్టర్‌గా ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆర్థిక స్థిరత్వమే అతడిని డీసీసీబీ చైర్మన్‌ను చేసింది. ఆపై పార్టీలో పట్టుకోసం చాపకింద నీరులా వ్యవహరించారు. ఏకంగా ఇన్‌చార్జి రితేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నాయకత్వానికి సవాల్‌గా నిలిచారు. టీడీపీ అధిష్టానం సైతం పాతచరిత్రతో నిమిత్తం లేకుండా ఆర్థిక సమర్థతను పరిగణలోకి తీసుకుంది. ఫలితంగా క్రమేపీ రితేష్‌రెడ్డి నాయకత్వాన్ని పక్కన పెడుతూ వచ్చింది. ఇక ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించడమే తరువాయి కానుంది. ఈ పరిణామాలు నియోజకవర్గంలోని సీనియర్లకు కంటగింపుగా ఉన్నప్పటికీ అవేవీ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇకపై బద్వేల్‌ నియోజకవర్గంలో టీడీపీ పెత్తనమంతా మంచూరు సూర్యనారాయణరెడ్డిదేనని ఇప్పటికే మంత్రి నారా లోకేష్‌ జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేసినట్లు సమాచారం. నారా లోకేష్‌ జిల్లా పర్యటన తర్వాతే వేగంగా ఈపరిణామాలు చోటు చేసుకున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

స్థానిక సంస్థల బాధ్యతలు సైతం సూర్యనారయణరెడ్డికే

మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వారసత్వానికి బ్రేక్‌

మంత్రి నారాలోకేష్‌ పర్యటన తర్వాత వేగంగా మార్పులు

బద్వేల్‌లో జీర్ణించుకోలేకున్న సీనియర్‌ నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement