కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను బ్యాంకులు గణనీయంగా అధిగమించి రుణాల పంపిణీలో విశేష పురోగతి సాధించాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి పాల్గొనగా.. వివిధ ప్రధాన బ్యాంకుల రీజనల్ మేనేజర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యతా రంగాల అభివృద్ధికి బ్యాంకులు సమర్థవంతంగా సహకరించాయని పేర్కొన్నారు. రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్‌పీఏలను మరింత తగ్గించేలా బ్యాంకులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న స్టార్ట్ అప్ కడప ఎంట్రప్రెన్యూర్ కేంద్ర నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో బ్యాంకర్లు కూడా భాగస్వామ్యం వహించి ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం రుణాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌కి వివరించారు. నాబార్డు డీడీఎం విజయ విహారి, యూబీఐ ఏజీఎం లక్ష్మీ తులసి, కేడీసీసీ సీఈఓ రాజమణి, ఎస్బీఐ ఆర్‌ఎం అబ్దుల్ రవుఫ్, రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ ఎలమంద, ఏపీజీబీ కడప ఆర్‌ఎం శ్రీనివాస్ ప్రసాద్, రాజంపేట ఆర్‌ఎం రాఘవేంద్ర, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ బ్యాంకర్ల సమావేశంలో
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


