మెరిసిన మనోళ్లు | - | Sakshi
Sakshi News home page

మెరిసిన మనోళ్లు

Jun 2 2026 12:26 AM | Updated on Jun 2 2026 12:26 AM

● కడప కుర్రోడు.. సాధించాడు ● జయహో జమ్మలమడుగు ● బద్వేలు బాలుడు భళా ● సిద్దవటం విద్యార్థి సత్తా

ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో

సత్తా చాటిన విద్యార్థులు

ఓపెన్‌ కేటగిరిలో

23, 28, 51 ర్యాంకులు

కడపకు గర్వకారణంగా నిలిచిన వైనం

కడప ఎడ్యుకేషన్‌ : ప్రతిష్టాత్మక ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌(2026) ఫలితాల్లో మనోళ్లు మెరిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వారు తమ ఆశయాలతోపాటు తల్లిదండ్రుల కల నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చెందిన విద్యార్థులు ఓపెన్‌ కేటగిరిలో 23, 28, 51, 243 ర్యాంకులు సాధించి భళా అనిపించారు. బద్వేలుకు చెందిన ఎ.హేమంత్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగు పట్టణానికి చెందిన పసల మోహిత్‌, సిద్దవటం మండలం వంతాటిపల్లెకు చెందిన ముక్కర సాకేత్‌రెడ్డి, వల్లూరు మండలంలో కొప్పోలుకు చెందిన మోపూరి వేదచరణ్‌రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి చరిత్ర లిఖించారు.

రాయలసీమ జిల్లాలకు 100లోపు ర్యాంకు అసాధ్యమని విద్యావేత్తలు భావించేవారు. అలాంటి వారి అంచనాలు తలకిందులు చేస్తూ వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఎ.హేమంత్‌కుమార్‌రెడ్డి, ముక్కర సాకేత్‌రెడ్డి, మోపూరి వేదచరణ్‌రెడ్డి జాతీయ స్థాయిలో 100లోపు ర్యాంకులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఫౌండేషన్‌ వేసిన ‘సంకల్ప్‌’

ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్స్‌, నీట్‌ ఇలాంటి పోటీ పరీక్షల్లో ఓపెన్‌ కేటగిరిలో 100లోపు ర్యాంకులు సాధిస్తూ సంకల్ప్‌ విద్యార్థులు చరిత్ర సృష్టిస్తున్నారు. సంకల్ప్‌ కడపలో చదివి, కడపలో ఫౌండేషన్‌ తీసుకొని ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026లో ఆల్‌ ఇండియా స్థాయిలో ఓపెన్‌ కేటగిరిలో 51వ ర్యాంకు వేదచరణ్‌రెడ్డి సాధించారు. గతంలో ఐఐటీ మెయిన్స్‌ ఓపెన్‌ క్యాటగిరిలో ఆల్‌ ఇండియా 7వ ర్యాంకు సాధించిన శశాంక్‌ అనిరుద్‌రెడ్డి, నీట్‌లో ఆల్‌ ఇండియా 100లోపు ర్యాంక్‌ సాధించిన వినయసింహరెడ్డి, ప్రణతిరెడ్డి కడప సంకల్ప్‌లో ఫౌండేషన్‌ కోర్స్‌ ద్వారా జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం విశేషం. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే సంకల్పంతో చేపట్టిన సంకల్ప్‌ ఫౌండేషన్‌ నుంచి గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం ఎంతో సంతృప్తిగా ఉందని సంకల్ప్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు వంశీ, రేణుక వెల్లడించారు.

● కడప నగరానికి చెందిన మోపూరి వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మీశిరీషల కుమారుడు మోపూరి వేద చరణ్‌రెడ్డి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కడప నాగార్జున మోడల్‌ స్కూల్లో చదువుకుంటూ సంకల్ప్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఫౌండేషన్‌ కోర్సు శిక్షణ తీసుకున్నాడు. 10వ తరగతిలో 600 మార్కులకు 578 మార్కులు సాధించాడు. ఆ తరువాత విజయవాడ నారాయణ కళాశాలలో ఎంపీీసీ(సీపీఎస్‌ఈ)లో 500 మార్కులకు 470 మార్కులు పొందారు.

కడప ఎడ్యుకేషన్‌: నగరానికి చెందిన వి.మల్లేశ్వరరెడ్డి, రాజేశ్వరి కుమారుడు వెంగరెడ్డి రెడ్డి ప్రసా ద్‌రెడ్డి 243వ ర్యాంకు సాధించాడు. ఈ అబ్బా యి కడపలోని నాగార్జున మోడల్‌ స్కూల్‌లో చదివి 10వ తరగతిలో 585 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్‌ను విజయవాడలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో చదివి ఎంపీసీ(సీబీఎస్‌సీ)లో 461 మార్కులు పొందాడు.

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణానికి చెందిన పసల మోహిత్‌ 26వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. పట్టణంలోని పెద్దపసుపల రహదారిలోని టీచర్స్‌ కాలనీకి చెందిన హరిత 395వ ర్యాంక్‌ సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు రామకృష్ణారెడ్డి, అపర్ణ తెలిపారు. పట్టణానికి చెందిన గొంగటి వెంకట వంశీధర్‌రెడ్డి 581వ ర్యాంక్‌ సాధించాడు.

బద్వేలు అర్బన్‌ : బద్వేలు పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఎ.హేమంత్‌కుమార్‌రెడ్డి 23వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి ఎ.విజయభాస్కర్‌రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా డు. హేమంత్‌కుమార్‌రెడ్డిని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మిత్రులు అభినందించారు.

సిద్దవటం : సిద్దవటం పట్టణానికి చెందిన ముక్కర సాకేత్‌ 28వ ర్యాంకు సాధించాడు. ఆ విద్యార్థి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను సిద్దవటంలోని శ్రీ భారతి హైస్కూల్‌లో అభ్యసించాడు. వంతాటిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ ముక్కర వెంకటసుబ్బారెడ్డి, ముక్కర నిర్మలాదేవి తన విజయానికి ప్రధాన ప్రేరణగా నిలిచారని సాకేత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement