కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప ఇన్‌చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా పీఎస్ సీఐ పి.నరసింహరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తమ సిబ్బందితో కలిసి ప్రధాన క్రికెట్ బుకీ ఇందిరెడ్డి జనార్ధన్‌రెడ్డిని ఆదివారం రాత్రి అక్కాయపల్లి శాస్త్రి నగర్‌లో అరెస్ట్ చేశారు. సోమవారం కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప ఇన్‌చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రినగర్‌లో ప్రధాన నిందితుడు ఇందిరెడ్డి జనార్ధన్‌రెడ్డి ఇంటిలో కడప తాలూకా సీఐ నరసింహరాజు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితుడు తన ల్యాప్‌టాప్, మొ బైల్ ఫోన్‌లు, వై–ఫై రూటర్ ద్వారా తన సబ్ బుకీలైన వారికి యూజర్ ఐడీలు, యూఆర్‌ఎల్ లింకులు పంపించి, వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బును స్వీకరిస్తూ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే కస్టమర్లను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని 12 విలువైన మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ వుంచినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి రూ.7,00,550 నగదు, ల్యాప్‌టాప్, ఐదు మొబైల్ ఫోన్‌లు, ఒక వైఫై రూటర్, నగదు కౌంటింగ్ మిషన్, 12 ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇందిరెడ్డి జనార్ధన్‌రెడ్డిని నడిపిస్తున్న ప్రధాన నిర్వాహకుడు, మోడమీదపల్లెకు చెందిన అంబవరం మాధవరెడ్డి అలియాస్ మోడమీదపల్లె మాధవరెడ్డి, పులివెందులకు చెందిన నరేష్, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గోల్డ్ శేఖర్, చెన్నూరుకు చెందిన గుగ్గిళ్ల చాణక్య, రెడ్డెయ్యరెడ్డి, హరినాథ్ అలియాస్ శ్రీహరి, ఆమంచి కళ్యాణ్ చక్రవర్తి, షేక్ ఇంతియాజ్, జయప్రకాష్ అలియాస్ చంటితోపాటు ఇంకా కొంతమంది ఉన్నట్లు వెల్లడైందని డీఎ స్పీ తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.


