డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఏవీ?
సాక్షి ప్రతినిధి, కడప: నోటితో చెప్పడం నొసలుతో వెక్కిరించడం దేని పని దానిదే. అచ్చం అలాగే వైఎస్సార్ కడప జిల్లా పట్ల సీఎం చంద్రబాబు వైఖరి స్పష్టమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం మహానాడు వేదికగా కడప కేంద్రంగా జిల్లా అభివృద్ధికి హామీల వర్షం కురిపించారు. జీఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్–1 పనులను పూర్తి చేసేందుకు రూ.1000కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తికి రూ.170కోట్లు, గండికోటలో శ్రీకృష్ణదేవరాయులు విగ్రహాం ఏర్పాటుకు రూ.32.5కోట్లు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కడపకు రూ.68.45కోట్లు, బుగ్గవంక ఆధునికీకరణకు రూ.100 కోట్లు, చెన్నూరు సమీపంలో హజ్‌హౌస్ పూర్తి కోసం రూ.10కోట్లు, దాదాపుగా రూ.1381కోట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు 2025 మే29న ప్రకటించారు. ఏడాది పూర్తయినా అభివృద్ధి పనుల్లో ఇసుమంతైనా పురోగతి లేదు. ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు.
కడప అంటే సీఎం చంద్రబాబుకు వివక్షే
నేను రాయలసీమలోనే పుట్టాను, సీమ బిడ్డనంటూ చెప్పుకునే సీఎం చంద్రబాబు రాయలసీమకు ప్రత్యేకించి వైఎస్సార్ కడప జిల్లాకు అభివృద్ధికి చేసింది శూన్యం. పైగా జిల్లా పారిశ్రామిక ప్రగతికి అవరోధంగా నిలుస్తూ అనేక మార్లు కడప అంటే కడపు మంట అని చాటుకున్నారు. నాటి బ్రహ్మణీ స్టీల్స్ నుంచి నేటి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకూ ఎన్నో ఆటంకాలు సృష్టించారు. తుదకు సాగు, తాగునీరు సరఫరాకు యోగ్యకరంగా నిలుస్తున్న పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు కూడా అడ్డుతగిలారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తుదకు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా సాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనుసంధానం ప్రక్రియను కూడా అడ్డుతగిలారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలంకారప్రాయంగా
పులివెందుల మెడికల్ కళాశాల
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధిని కూడా కొనసాగించలేని దుస్థితిలో కూటమి సర్కార్ ఉండిపోయింది. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల నిలుస్తోంది. రూ.530 కోట్లతో నిర్మించిన ఈ మెడికల్ కళాశాలకు ఎన్‌ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్) అనుమతులు కూడా దక్కాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 50ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే పెండింగ్ పనులు ఆటంకం లేకుండా పూర్తి చేస్తామని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ కోరింది. ఆ లేఖను ఇస్తే 2024–25కు 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యేవి. 5శాతం పెండింగ్ పనులు కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ మనుసు అంగీకరించలేదు. వెరశి ఎన్‌ఎంసీకి సీట్లు అవసరం లేదంటూ ఏకంగా ఎన్‌ఎంసీ లెటర్ రాశారు. 2024–25లో 50 సీట్లు దక్కి ఉంటే ఈ ఏడాది 2025–26, 2026–27లల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున లభించేవి. జిల్లాలో పట్ల సీఎం చంద్రబాబు కడపు మంటకు మెడికల్ కళాశాల ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జిఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్–1 పనులు వేగంగా చేసేందుకు రూ.1000 కోట్లు, వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేసేందుకు రూ.170కోట్లు మంజూరు చేయనున్నట్లు ఏడాది క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే వీరపునాయునిపల్లె, వేంపల్లే, వేముల, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు, కమలాపురం, కడప మండలాల్లో భూసేకరణ, పెండింగ్ పనులు నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. చిత్త శుద్ధి లేని హామీలు ఇవ్వడం.. ఆపై మిన్నకుండిపోవడం మినహా, నిర్దిష్టమైన అభివృద్ధి చేయాలనే తలంపు కూటమి సర్కార్‌కు లేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అదే స్థాయిలో సీఎం హామీలు అమలు చేయించి ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు తట్టలేదని పరిశీలకులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అభివృద్ధి కోసం కొంతైనా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
కడప వేదికగా రూ.1380కోట్ల నిధుల మంజూరుకు సీఎం హామీ
ఏడాది పూర్తయినా అభివృద్ధిలో పురోగతి లేదు...నిధుల ఊసు అసలే లేదు
నాడు ఓట్లు–సీట్లు ఇవ్వలేదన్న చంద్రన్న...సీట్లు ఇచ్చినా అదే వివక్ష
2014లో అధికారం దక్కించుకున్న తర్వాత జిల్లా పర్యటనకు సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఓ బహిరంగ సభలోనే మీరు నాకు ఓటేశారా..మీకు అభివృద్ధి చేయడానికి..? అంటూ ప్రశ్నించారు. 2024లో ఓట్లు సీట్లు ఇచ్చినా ఈ ప్రాంతం పట్ల అక్కసు, అసూయ తగ్గడం లేదని పలువురు మండిపడుతున్నారు. నాడు ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పద్మావతి మెడికల్ కళాశాలల్లో సీట్లు రాయలసీమ విద్యార్థులతోనే భర్తీ చేయాలనే నిబంధనలను నాటి చంద్రబాబు సర్కార్ తోసి పుచ్చుతూ జిఓ 130 తీసుకొచ్చి రాయలసీమకు అన్యాయం చేసింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పులివెందుల మెడికల్ కళాశాలకు 50సీట్లు ఎన్‌ఎంసీ కేటాయిస్తే చంద్రబాబు సర్కార్ మోకాలొడ్డుతోంది. స్వతహాగా సీఎం చంద్రబాబుకు రాయలసీమ, అందులో కడప, పులివెందుల అంటే ఎక్కడ లేని కోపం, ఆక్రోశం వెళ్లగక్కుతాడడని పలువురు ఆరోపిస్తున్నారు. మభ్యపెట్టే మాటలు చెప్పడం మినహా నిర్దిష్టమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేసిన చరిత్రే లేదని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు.
అలంకారప్రాయంగా ఎమ్మెల్యేలు
కూటమి ఎమ్మెల్యేలు అలంకారప్రాయంగా ఉండిపోయారు. సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా, జిల్లా పర్యటనకు వ చ్చిన ప్రతిసారి హామీలు ఇవ్వడం,ప్రజల్ని మభ్యపెట్టడం మినహా జిల్లాలో అభివృద్ధి లేదు.ప్రజాప్రతినిధులకు నిలదీసే దమ్ము లేదు.
– గాలి చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐ
సీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎం చంద్ర బాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఏడాది గడిచినా ని ధులు విడుదల చేయలేదు.త్వర లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబు తారు.స్థానిక సంస్థలఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సివస్తోంది. –చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం


