డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

కడప కార్పొరేషన్‌: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ లేదాసిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని, అయితే ఈ డీఎస్సీలో పేపరు లీకేజీ వల్ల మెరిట్‌ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఏపీపీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న నవీన్‌ అనే వ్యక్తికి మొదటి ర్యాంకు వచ్చిందని, అతని వల్లే పేపరు లీక్‌ అయిందన్నారు. అతను ఎంతమంది ఆ పేపరును లీకేజ్‌ చేశారో తెలియదన్నారు. అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని ఒకసారి, ఉద్యోగం అవసరం లేదని చెప్పాడని మరోసారి, ఒక ఉద్యోగం చేస్తున్నందున మరో ఉద్యోగం ఇవ్వలేదని ఇంకోసారి ఇలా రకరకాలుగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అలాగే డీఎస్సీపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తి అవాస్తవమన్నారు. 33,300 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని అధికారులు పరిష్కరించలేదన్నారు.

● దొంగే దొంగ దొంగ అన్నట్లు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తమ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబితే మీ హయాంలో తప్పులు జరిగాయి...జగన్‌ మేనమామ పోస్టులు అమ్ముకున్నారని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో లక్షా 73 వేల సచివాలయ ఉద్యోగాలను ఎలాంటి సిఫార్సు లేకుండా పూర్తి మెరిట్‌ ప్రకారం భర్తీ చేశారన్నారు. దీనిపై వారు విచారణ కూడా చేసుకోవచ్చన్నారు. ఈ ప్రభుత్వం 16 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తుంటే, 96 ఆరోపణలు వచ్చాయన్నారు.

జెడ్పీ నియామకాల్లో అక్రమాలపై

విచారణ చేపట్టాలి: జెడ్పీలో నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా..విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సవాల్‌ విసిరారు. విజయనగరంలో ఓ అభ్యర్థి డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాకు పూర్తి అర్హుడైనప్పటికీ అతనికి ఆ కోటాలో ఉద్యోగం రాలేదన్నారు. డీఎస్సీ, టెట్‌ పాసైన వారికి కాకుండా డైరెక్టుగా శాప్‌ ద్వారా పోస్టులు భర్తీ చేసి మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో డీఎస్సీ–1998 వారికి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, అవన్నీ పూర్తి పారదర్శకంగా జరిగాయన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్‌ వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల తరుపున తాము పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని, రెండేళ్లవుతున్నా ఒక్క పీఆర్సీ కనిపించలేదని, నాలుగు డీఏలు, ఐఆర్‌ పెండింగ్‌లోఉన్నాయన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ. 30 వేల కోట్లు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ మేయర్‌ పాకా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ హయాంలో తప్పులు జరిగాయని చెప్పడం దారుణమన్నారు. అప్పుడు అక్రమాలు జరిగి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే రామగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈసమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు పులి సునీల్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు వీరారెడ్డి, శ్రీ రంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దొంగే దొంగ..దొంగ అన్నట్లు ప్రభుత్వ వ్యవహారం

ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement