ఎర్రగుంట్ల : చిన్నదండ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్త గోపులాపురంలో గోసుల శ్రీరాములు (23) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కలమల్ల ఎస్‌ఐ సునీల్ కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త గోపులాపురానికి చెందిన గోసుల చౌడప్ప కుమారుడు గోసుల శ్రీరాములు పదేళ్ల కిందట అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేట నుంచి వచ్చి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా గ్రామంలోని ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవారు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు ఇటీవల ఆమెను మందలించి గ్రామం నుంచి తీసుకెళ్లారు. గత నెల ఆమె తిరిగి గ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి శ్రీరాములు ఇంట్లో ఇద్దరూ నిద్రపోయారు. ఆదివారం ఉదయం శ్రీరాములు సోదరి పార్వతి ఇంటి వద్దకు వచ్చి చూడగా.. శ్రీరాములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. జమ్మలమడుగుడు డీఎస్పీ వెంకటేశ్వరరావు, యర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి గొంతుపై కమిలిన గుర్తులు ఉన్నట్లు తెలిపారు. శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


