● తండ్రి లారీ డ్రైవర్
● ఇద్దరు కుమారులు వైద్యులు
● నెరవేరిన వారి కల
వారు పేదింటి పిల్లలు.. పల్లె ప్రాంతానికి చెందిన వారు.. తమ చదువుకు ఇవేవీ ఆటంకం కాదని నిరూపించారు. ఇద్దరు అన్నదమ్ములు నీట్‌లో సీటు సాధించి వైద్య విద్య అభ్యసించారు. తమ తల్లిదండ్రుల కల నెరవేర్చారు. పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.
వేంపల్లె : రోజంతా లారీ నడుపుతూ కుటుంబ భవిష్యత్తు కోసం కష్టపడిన ఓ తండ్రి కన్నీటి కల నెరవేరింది. వేంపల్లెలోని మేదర వీధిలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహబూబ్ బాషా వృత్తి రీత్యా లారీ డ్రైవర్, ఆయన భార్య కౌసర్ గృహిణి, వీరికి ఇద్దరు కుమారులు. వారిని బాగా చదివించాలనే ఉద్దేశంతో.. సంపాదన తక్కువైనా మహబూబ్ బాషా ఎన్నో కష్టాలు భరించారు. మండే ఎండలు, వర్షాలు, రాత్రింబవళ్లు లారీ నడిపి పిల్లల చదువుల కోసం జీవితమంతా రోడ్లపైనే గడిపారు. తన పిల్లలు మాత్రం మంచి స్థాయికి చేరాలని ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన కుమారులు చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు. ముందుగా మహబూబ్ బాషా పెద్ద కుమారుడైన ఉమర్ బాషా రెండు సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ పూర్తి చేయగా రెండవ కుమారుడు సమీర్ బాషా కూడా ఎంబీబీఎస్‌ను ఫస్ట్ క్లాస్‌తో పూర్తి చేసి కుటుంబానికి అపారమైన ఆనందాన్ని అందించారు. మొదటి కుమారుడు డాక్టర్ ఉమర్ కడప రిమ్స్‌లో, రెండవ కుమారుడు డాక్టర్ సమీర్ బాషా కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ను పూర్తి చేశారు. తండ్రి మహబూబ్ బాషా, తల్లి కౌసర్, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు అన్న డాక్టర్ ఉమర్ బాషా ప్రోత్సాహంతో సమీర్ బాషా తన వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. తండ్రి కష్టం, తల్లి ఆశీర్వాదం, కుటుంబ నమ్మకం కలిసొచ్చి ఒక లారీ డ్రైవర్ కుమారులు డాక్టర్ స్థాయికి ఎదిగారు. ఒక లారీ డ్రైవర్ కుమారులు వైద్యులు కావడం ఇప్పుడు ఎంతో మంది పేద కుటుంబాల పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ఇద్దరు కుమారులు మాట్లాడుతూ మా తండ్రి స్టీరింగ్ పట్టి మా భవిష్యత్తును నడిపించారని తెలిపారు. నేడు స్టెతస్కోప్ పట్టడం మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండే గర్వకారణం అని లారీ డ్రైవర్ మహబూబ్ బాషా తెలిపారు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో వేంపల్లి గ్రామ ప్రజలు, బంధుమిత్రులు సమీర్ బాషా, ఉమర్ బాషాకు అభినందనలు తెలియజేస్తున్నారు.
తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశాం
మా తల్లిదండ్రుల కష్టాలను మేము కళ్లారా చూశాం. భవిష్యత్తులో వారి కష్టాలను తొలగించి సుఖ జీవనం సాగాలని కోరుకున్నాం. ఒక లక్ష్యంతో కష్టపడి చదివాం. అలాగే 10 మందికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కష్టపడ్డాం. తండ్రికి వచ్చిన చిన్న ఆదాయంతోనే మేము మంచిగా చదివి ఉచితంగా సీట్లు సాధించి ఉన్నత స్థాయి చదువులు అభ్యసించాం. మా తల్లిదండ్రుల కలను మేము సహకారం చేశాం. – డాక్టర్ సమీర్ బాషా, ఎంబీబీఎస్, మేదర వీధి, వేంపల్లె


