ఆటోను ఢీకొన్న బొలెరో | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న బొలెరో

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

ఎర్రగుంట్ల : మండల పరిధి పెద్దనపాడు గ్రామ సమీపంలోని చాకిరేవుకు వెళ్లే మలుపు వద్ద బొలెరో వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ పెద్దమాచుపల్లె ఆంజనేయులు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. సీఐ విశ్వనాథరెడ్డి తెలిపిన వివరాల మేరకు... ఎర్రగుంట్ల పట్టణంలోని పుష్పగిరి మాన్యంలో నివాసం ఉండే గుమ్మయ్య కుమారుడు ఆంజనేయులు ఆటోను బాడుగులకు నడుపుతూ, రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఆయనకు భార్య లక్ష్మీనరసమ్మతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఆదివారం లక్ష్మీనరసమ్మ బట్టలు ఉతకడానికి పెద్దనపాడు గ్రామ పరిధి వంకలోని చాకిరేవుకు వెళ్లింది. ఆంజనేయులు ఆటో నడుపుకొంటూ అక్కడికి బయలుదేరాడు. చాకిరేవుకు వెళ్లే మలుపు వద్ద బొలెరో వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే సమీపంలో ఉన్న లక్ష్మీనరసమ్మ వెంటనే స్థానికుల సాయంతో ఆంజనేయులును ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరగైన వైద్య కోసం కడప రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేసే లోపే ఆంజనేయులు మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బద్వేలులో

దొంగల హల్‌చల్‌

బద్వేలు అర్బన్‌ : పట్టణంలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దొంగలు హల్‌చల్‌ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక శ్రీకృష్ణదేవరాయనగర్‌ 5వ లైన్‌లో ఓ ఇంటిలోకి ప్రవేశించి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదు, కొంత వెండి సామగ్రి చోరీ చేశారు. అనంతరం స్థానిక మైదుకూరురోడ్డులోని ఎంసీ ఫర్నిచర్‌షాపులో శనివారం అర్ధరాత్రి గడ్డపారతో షట్టర్‌ లాక్‌లు తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు క్యాష్‌టేబుల్‌ డ్రాయర్లు, బీరువా తాళాలు పగులకొట్టి నగదు కోసం గాలించారు. అయితే ఎటువంటి నగదు లభించకపోవడంతో షాపునకు సంబంధించిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. అలాగే నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో గల సియట్‌ షోరూమ్‌లోకి ప్రవేశించిన దుండగులు క్యాష్‌ కౌంటర్‌లోని రూ.60 వేల నగదుతోపాటు షోరూమ్‌లోని రూ.1.20 లక్షలు విలువ చేసే 8 స్టార్‌ హెడ్‌లైట్లు దొంగిలించారు. ఉదయం దుకాణాలు తెరిచేందుకు వెళ్లిన ఆయా షాపుల యజమానులు చోరీ జరిగినట్లు గుర్తించి అర్బన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో చోరీ ఘటనలు చోటు చేసుకోవడంతో సీరియస్‌గా పరిగణించిన అర్బన్‌ పోలీసులు దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో

మహిళ దుర్మరణం

చిన్నమండెం : కొత్తపల్లి గ్రామం మల్లూరు క్రాస్‌ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయనగరం రమణమ్మ(35) దుర్మరణం చెందింది. మండల పరిధిలోని శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన విశ్వనాథ్‌ సతీమణి రమణమ్మ సొంత పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లేందుకు మల్లూరు క్రాస్‌ వద్దకు వెళ్తుండగా.. కొండారెడ్డి మామిడి తోట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement