ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన ఎద్దుల జయమ్మ(63) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు నాగరాజు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. పోట్లదుర్తి గ్రామంలో నివాసం ఉండే ఎద్దుల నాగన్న, జయమ్మకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గేదెలను కట్టేసే విషయంలో కోడలితో గొడవ పడింది. ఈ క్రమంలో జయమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తర్వాత తిరిగి రాలేదు. బంధువులు ఇళ్లు, చుట్టు పక్కల వారిని విచారణ చేసినా ఫలితం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
నైతిక విలువలు, వృత్తి
నైపుణ్యాలతో విశ్వసనీయత
కడప సెవెన్‌రోడ్స్ : జర్నలిజంలో నైతిక విలువలు, వృత్తి నైపుణ్యం, కచ్చితత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవడం ద్వారా మీడియా పట్ల ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణ విలేకరులకు నిర్వహించిన రెండు రోజుల పునశ్చరణ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. అన్నమయ్య జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టు కొర్రా విజయ్‌కుమార్, తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనార్దన్, కర్నూలుకు చెందిన డెస్క్ సీనియర్ జర్నలిస్టు నవీన్‌కుమార్ చౌదరి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకుడు రామసుబ్బారెడ్డి, సమాచార పౌరసంబంధాల ఏడీ పద్మజ, పెద్ద సంఖ్యలో విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.


