మైదుకూరు : మండలంలోని ముసల్నాయనిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు రాళ్లు, చాకులతో దాడి చేసుకోవడంతో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగి 41 రోజులైన సందర్భంగా గ్రామస్తులు తమ బంధువులను పిలుచుకొని వేడుక చేసుకున్నారు. బంధువుల ఇళ్లకు వచ్చిన వారిలో ఓ వర్గం వారు భార్యాభర్తల గొడవను ప్రస్తావించి పరస్పరం రెచ్చగొట్టుకోవడం ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. గ్రామానికి చెందిన బండి తిరుమలయ్య అనే యువకునికి మున్సిపాలిటీలోని వేపరాలపల్లెకు చెందిన కశెట్టి ఓబయ్య కుమార్తె ప్రసన్నతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్నాళ్లుగా వారు విడిగా ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకకు వచ్చిన వారు భార్యాభర్తల విషయం ప్రస్తావించి.. వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. సంఘటనలో నానుబాల ఇంద్రసేన, నానుబాల శివ, నానుబాల చిన్న ఈశ్వరయ్య, బండి తిరుమలయ్య, బండి సురేష్, బండి సుబ్బరాయుడు అనే వారు గాయడ్డారు. ఓ వర్గాన్ని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి, మరో వర్గానికి చెందిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పరస్పర ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


