వేంపల్లె : మండల పరిధి నాగూరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన గ్రీన్ అంబాసిడర్ వేమా నాగన్న (55) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వేమా నాగన్న విధుల్లో భాగంగా ఈ నెల 27న మూడు చక్రాల రిక్షాపై నాగూరుకు బయలు దేరారు. మార్గం మధ్యలో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వివరించారు. ఆయనకు భార్య మేరీ సువర్ణ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
బద్వేలులో చోరీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని సిద్దవటం రోడ్డులో గల శివరామకృష్ణనగర్ 5వ వీధిలోని ఓ ఇంటిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు..శివరామకృష్ణనగర్ 5వ లైన్‌లో నివసిస్తున్న బోవిళ్ళనరసింహారెడ్డి కన్‌స్ట్రక్షన్ బిల్డర్‌గా పనిచేస్తుండేవాడు. ఈయన భార్య బ్యాంకు పని నిమిత్తం అట్లూరుకు వెళ్లగా నరసింహారెడ్డి సొంత పని నిమిత్తం బయటికి వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగులకొట్టి అందులోని 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.85 లక్షల నగదుతో పాటు పూజగదిలోని వెండి సామగ్రిని దోచుకెళ్లారు. సాయంత్రం సమయంలో నరసింహారెడ్డి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని అర్బన్ ఎస్‌ఐ కొండారెడ్డి పరిశీలించారు.
ప్రొద్దుటూరులో..
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనిఽధి మిల్లులోని ఆఫీసు బీరువాను పగులకొట్టి అందులోని రూ. 12 లక్షలకు పైగా నగదును దొంగలు దోచుకెళ్లారు. దొంగలను పసిగట్టకుండా ఉండేందుకు ఆఫీసులోని సీసీ కెమెరాల వైర్‌ను దుండగులు కట్ చేశారు. అలాగే ఘటనా స్థలంలో కారం పొడి చల్లారు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పిడుగుపాటుకు
బొగ్గుల బట్టీ దగ్ధం
సింహాద్రిపురం : మండలంలోని కోవరంగుంటపల్లెలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు బొగ్గుల బట్టీ దగ్ధమైంది. బట్టీ నిర్వాహకుడు మాబు అలియాస్ పండుకు చెందిన రూ.15 లక్షలు విలువైన ముడి సరుకు, బొగ్గు సంచులు కాలిపోయాయి. బాధితుడి వివరాల మేరకు.. బట్టీ ఏర్పాటు చేసేందుకు శనివారం 20 ట్రాక్టర్ల కట్టెలు సిద్ధం చేసి ఈదురు గాలులు, ఉరుములు అధికమవడంతో ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే పిడుగుపాటుకు కట్టెలతో పాటు గతంలో కాల్చిన 400 బొగ్గుల సంచులు అగ్నికి ఆహుతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు.
పిడుగుపాటుతో మహిళ మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవాలయం సమీపంలో ఉంటున్న కొట్టు అంజనమ్మ(36) పిడుగుపాటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి గాలివాన భీభత్సం సృష్టించింది. చిలంకూరు గ్రామం సమీపంలో పిడుగు శబ్దంతోపాటు మెరుపు రావడంతో అంజనమ్మ ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి కుప్పకూలి పోయింది. స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు మహేష్ కూడా ఈ పిడుగు శబ్దానికి కింద పడ్డాడు.అతన్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. మహేష్ మాసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్టు
దువ్వూరు : బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. శనివారం మైదుకూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను వల్లూరు మండలం కొట్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు ఈశ్వర్ (19) ఆరు నెలల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో బాలికకు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో గత సోమవారం ఆ బాలిక దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఉన్న చర్చికి వచ్చింది. ఆ బాలికను ఈశ్వర్ బైక్‌పై ఎక్కించుకుని ఖాజీపేట బైపాస్‌లో ఉన్న ఓ లాడ్జీలోకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను గుడిపాడు దగ్గర వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత అధిక రక్తస్రావం అవుతుండటంతో తల్లికి జరిగిన విషయం తెలిపిందని చెప్పారు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని ప్రొద్దుటూరు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినటు తెలిపారు.


