అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీల అమలేదీ? | - | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీల అమలేదీ?

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

నమ్మించి మోసం చేయడంలో

‘కూటమి’సూపర్‌ సక్సెస్‌

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు: అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు అమలు చేయలేదని, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్‌ సక్సెస్‌ అయిందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్‌, బీజేపీ పార్టీలు ఇష్టారాజ్యంగా అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. హామీల అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై వ్యక్తిగతంగా దూషణలు , దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు.

ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతి అమలు ఎప్పడో..

రెండేళ్ల పరిపాలనలో కూటమి ప్రభుత్వం 3.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఏమైనా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిందా అంటే అదీలేదన్నారు. ఆడ బిడ్డనిధి, నిరుద్యోగ భృతిని ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై ఇంత వరకు స్పష్టతలేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి సైతం అమలు చేసిన చరిత్ర ఆయనకు దక్కితే.. హామీల అమలును విస్మరించిన చరిత్ర కూటమి నేతలకు దక్కుతుందన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారన్నారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి నియోజకవర్గంలో ఏమి చేసినా తమకు కప్పం కట్టాలంటూ ఎమ్మెల్యేలు వ్యాపారులను శాసించడం జరుగుతోందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నదుల్లో ఉన్న ఇసుకను కోట్లాది రూపాయలకు వీళ్ల జాగీర్లు అయినట్లు అమ్మేసుకుంటున్నారన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన

మహానాడులో ప్రజా సమస్యలపై , సంక్షేమ పథకాల అమలుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు.కార్యక్రమాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణతో సరిపెట్టారన్నారు. పైగా జగన్‌ పార్టీని గొడ్డలిపార్టీ అంటూ అసత్య ప్రచారం చేయడంతోపాటు ఇంకా జగన్‌ రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ సిగ్గులేకుండా అసత్యాలు పలికాన్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రెండేళ్లలో ప్రజలకు వారు చేసింది ఎమిలేదన్నారు. టీడీపీ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే పని కాకుండా ప్రజలను మెప్పించే ప్రయత్నం చేయాలని హితవుపలికారు. ఈనెల 4వ తేదీన మండల కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలను కాల్చి నిరసన కార్యక్రమాన్ని, 12న నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ బాలయ్య, ఎర్రగుంట్ల నాయకులు జయరామిరెడ్డి, శివారెడ్డి, రైతు విభాగం నాయకులు విశ్వనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement