ఎర్రగుంట్ల : మండల వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు గాలివాన బీభత్సం సృస్టించింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) కాలనీలోని ఈ టైపు క్వార్టర్స్‌లో ఉంచిన కారుపై భారీ చెట్టు పడింది. కారు భూమికిలోకి కూరుకుపోయింది. ఎర్రగుంట్ల, వై కోడూరు, కలమల్ల, మాలెపాడు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.విద్యుత్ శాఖ ఏడీఈ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో గ్రామాల్లో రాత్రంతా అంధకారం నెలకొంది.
● చెట్టు కూలి దూడ మృతి
ముద్దనూరు : ముద్దనూరు మండలంలో గురువారం రాత్రి ప్రకృతి బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక పాతబస్టాండు ఆవరణలోని బస్‌షెల్టర్ వద్ద ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. రాత్రి కావడం, జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెన్నారెడ్డిపల్లెలో దూడపై చెట్టు పడటంతో దూడ మృతి చెందింది. ఇదే గ్రామంలో గేదైపె చెట్టు పడటంతో తీవ్రంగా గాయపడింది. చెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది. పెనుగాలులకు సుమారు 50 చెట్లు నేలకూలాయి. మండల వ్యాప్తంగా సుమారు 70 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగినట్లు విద్యుత్తు శాఖ ఏఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు మండల వ్యాప్తంగా అంధకారం నెలకొంది.


