అధికారుల నిర్లక్ష్యం ఖరీదు.. ఓ నిండు ప్రాణం
కడప అర్బన్: కడప నగరంలోని గుర్రాలగడ్డ సమీపంలో శుక్రవారం నీటి గుంతలో పడి సయ్యద్ యూనస్ (4) అనే బాలుడు మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువుల సమాచారం మేరకు...
కడప నగరంలోని గుర్రాలగడ్డ వీధి సమీపంలో నివాసముంటున్న సయ్యద్ మున్నా, సాజిదాభానులకు సయ్యద్ యూనస్ (4), జహీర్ (7), సాజిద్ (9) ముగ్గురు సంతానం. వీరిలో సయ్యద్ యూనస్, జహీర్ శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఆడుకుంటూ సమీపంలోని వంతెన నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. ఇటీవల పడిన వర్షాలకు ‘పిల్లర్ల’ మధ్యలోని గుంతలు నీటితో నిండి ఉన్నాయి. ఈ క్రమంలో ఆడుకుంటూ యూనస్ నీటిలోకి దిగి మునిగిపోయాడు. భయపడిన అన్న జహీర్ కేకలు వేసుకుంటూ ఇంటికొచ్చాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అంతలోపే యూనస్ నిండా మునిగిపోయాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను చేపట్టారు. సుమారు అరగంట తర్వాత బాలుడిని వెలికి తీసి ప్రథమచికిత్స చర్యలను చేపట్టి కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. అంతవరకు ఊపిరిబిగపట్టి చూస్తున్న తండ్రి మున్నా ఒక్కసారిగా బోరున విలపించారు. యూనస్ మృతదేహాన్ని పట్టుకుని ‘మేరే బేటే!ఉఠో ఘర్‌కు చలింగే!!’ అంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.
బాలుడి మృతికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం
కడప నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్రాలగడ్డ నుంచి రవీంద్రనగర్‌లోకి బుగ్గవంక వీదు గా రోడ్డు వేసేందుకు పిల్లర్లను నిర్మించారు. పిల్లర్ల చుట్టూ ఏర్పడిన గుంతలు దాదాపు 10 అడుగులకుపైగా లోతులో వున్నాయి. ఇటీవల పడిన వర్షాలకు గుంతనిండా నీళ్లు చేరాయి. ఈ గుంతల చుట్టూ కంచెను ఏర్పాటు చేయలేదు. పిల్లర్ల నిర్మాణ సమయంలో బుగ్గవంక ప్రహరీని పగులగొట్టిన కాంట్రాక్టర్ ప్రహరీనిగానీ పూర్తి చేయకుండా వదిలేశాడు. దీంతో అవి ప్రమాదాలకు నెలవుగా మారాయి. రెండు రోజుల క్రితం ఓ చిన్నారి నీటి దగ్గరికి వెళ్లి ఆడుకుంటుండగా మునిగిపోతుండగా స్థానికులు గమనించి రక్షించారు.
ఆ సంఘటన తరువాత కాంట్రాక్టర్‌కు, అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా నిర్లక్ష్యం వీడలేదు.
బుగ్గవంకపై బ్రిడ్జిల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. ప్రమాదాలు పొంచి ఉన్నాయని సాక్షి ముందే హెచ్చరించింది. కాంట్రాక్టర్ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. ముందే మేల్కొని ఉంటే ఈ విషాద ఘటన జరిగేది కాదు.
ఆ చిన్నారి కంటికి పూసిన సుర్మా అలాగే ఉంది.. ఒంటికి రాసిన అత్తరు గుబాళి స్తూనే ఉంది.. ఈద్ రోజు చిట్టి చేతులతో చేసిన దువా అతని తల్లిదండ్రుల కళ్లముందు కదలాడుతూనే ఉంది.. ఇల్లంతా తిరుగుతూ చేసిన అడుగుల సవ్వడి ఇంకా వినిపిస్తూనే ఉంది.. పండగ క్షణాలు ఇంకా చెరిగిపోకముందే.. ఆ ఇంట విషాదం అలుముకుంది.. తియ్యని ఈద్ జ్ఞాపకాలు తుడిచిపోకముందే.. కఠిన చేదు వార్త వారి గుండెల్ని తాకింది.. సరిగ్గా ఐదేళ్లు నిండని చిరు వయసులోనే మృత్యుకౌగిట్లోకి ‘జారి’పోయిన పిల్లాడిని చూసి తల్లిదండ్రుల కంట కన్నీరొలికింది. నీటి గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతిచెందిన విషాద ఘటన కడపలో చోటుచేసుకుంది.
త్యువాత
నాయకుల నిర్లక్ష్యానికి బలైంది.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: బుగ్గవంకపై షామీరియా బ్రిడ్జి నిర్మాణపు నీళ్ల గుంతలో పడి గుర్రాలగడ్డ వీధికి చెందిన 5 ఏళ్ల బాలుడు సయ్యద్ యూసఫ్ మృతి చెందిన విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ పేర్కొన్నారు. శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటన పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం, నిర్మాణ పనుల పర్యవేక్షణలో వైఫల్యం వల్లే జరిగిందని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి షామీరియా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించినా.. నిరంతరాయంగా పూర్తి చేసే బాధ్యతలో విఫలమయ్యారని విమర్శించారు. ఘటన జరిగాక మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ‘ప్రవేశం లేదు‘ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారని.. అదే ప్రమాదం జరగకముందే ఈ చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బుగ్గవంక గుంతలో పడి బాలుడు మృతి
కాంట్రాక్టర్, కార్పొరేషన్ అధికారులనిర్లక్ష్యమే కారణం
నీటి గుంతలో పడి మృతిచెందిన యూనస్ మృతదేహాన్ని రిమ్స్ క్యాజువాలిటీలో మాజీమేయర్ పాకా సురేష్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు బాలస్వామిరెడ్డి, అజ్మతుల్లాలు, ఇతర వైఎస్‌ఆర్ సీపీ నేతలు పరిశీలించారు. బాలుడి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుగ్గవంకలో వంతెన నిర్మాణపనులలో పిల్లర్ల వరకే పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా వంతెన నిర్మాణ పనులు చేయలేదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ తనకు బిల్లులు మంజూరు కాలేదంటూ నిర్లక్ష్యంగా ఎక్కడిపనులను అక్కడ వదిలేయడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలన్నారు. కాంట్రాక్టర్‌పైనా, పర్యవేక్షణ అధికారులపైన చర్యలను తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేవరకు వైఎస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం చేసి అండగా నిలుస్తుందన్నారు.


