కర్షకుడికి కాయ కష్టం! | - | Sakshi
Sakshi News home page

కర్షకుడికి కాయ కష్టం!

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

తగ్గుతున్న సాగు విస్తీర్ణం

కడప అగ్రికల్చర్‌: జిల్లాలో వరుణుడు కరుణించాడు. వర్షాలు ఆశాజనకంగా ప్రారంభం కావడంతో రైతన్నలు కాడీ మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో ఖరీఫ్‌–2026 సీజన్‌ కూడా అధికారికంగా ప్రారంభం కానుంది. కోటి ఆశలతో రైతులు దుక్కులు దున్నుతున్న వేళ.. వేరుశనగ విత్తనకాయల సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిబంధనల కోతలు రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

సేకరణ ఆరంభించని అధికారులు

సీజన్‌ ముంచుకొస్తున్నా జిల్లాలో ఇంతవరకు వేరుశనగ విత్తనకాయల ప్రొక్యూర్‌మెంట్‌ (సేకరణ) ప్రక్రియే ప్రారంభం కాలేదు. అధికారులు వీటిని ఎప్పుడు కొనుగోలు చేస్తారు? రైతులకు ఎప్పుడు సరఫరా చేస్తారనే విషయాలపై తీవ్ర మల్లగుల్లాలు నడుస్తున్నాయి. జిల్లాలో ’వేముల’ మండలం మినహా మరెక్కడా విత్తనాల కోసం రైతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా మొదలుకాలేదు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే జూన్‌ రెండో వారం దాటితే కానీ విత్తనకాయలు చేతికి వచ్చేలా లేవు.

ప్రభుత్వ పంపిణీలో నిబంధనల గోడలు!

ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సకాలంలో వచ్చేలా లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయిద్దామన్నా రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓపెన్‌ మార్కెట్‌లో వేరుశనగ క్వింటాల్‌ ధర రూ.10,000 పైగా పలుకుతుండటంతో అంత పెట్టుబడి పెట్టలేక చిన్న, సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి 4,788 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీకి (కే–6, టీఎస్‌జీఎస్‌–1694, నారాయణి రకాలు) వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, ఇందులో పెట్టిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి.

ఇరిగేటెడ్‌ రైతులకు మొండిచేయి

నాన్‌–ఇరిగేటెడ్‌ (వర్షాధార) మండలాలకు తప్ప, ఇరిగేటెడ్‌ (ఆయకట్టు) పరిధిలోని మండలాలకు విత్తనకాయలను కేటాయించకుండా అధికారులు చేతులెత్తేశారు. అర ఎకరా లోపు ఉంటే ఒక మూట (30 కిలోలు), ఎకరా లోపు ఉంటే రెండు బస్తాలు, ఎకరా దాటి ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా కేవలం మూడు బస్తాలు (90 కిలోలు) మాత్రమే ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ‘ఐదెకరాలున్న రైతుకు మూడే బస్తాలిస్తే.. మిగతా పొలానికి ఓపెన్‌ మార్కెట్లో వేలాది రూపాయలు పోసి కొనుగోలు చేయాలా?‘ అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

తొలకరి పలకరించినా.. తలుపు తెరవని విత్తన కేంద్రాలు

ఖరీఫ్‌ ముంగిట వేరుశనగరైతన్నల ఆందోళన

కూటమి పాలనలో విత్తనానికికోత, సాగుకు ఘాత

దుక్కులు దున్నినాదిక్కుతోచని స్థితిలో రైతన్న

ప్రభుత్వ ఉదాసీనత, విత్తన కోతల ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జిల్లాలో 5,976 హెక్టార్లలో వేరుశనగ సాగు కాగా, ఈ ఏడాది దానిని 4,446 హెక్టార్లకే పరిమితం చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,530 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పడిపోనుంది. ‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మే నెలాఖరు నాటికే పూర్తిస్థాయిలో విత్తనాలు జిల్లాకు చేరేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేసి, మండలాలకు కేటాయించి, డి–కృషి యాప్‌లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.‘ అని స్థానిక రైతులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement