మరోసారి పిలిస్తే ‘చీరే’స్తాం! | - | Sakshi
Sakshi News home page

మరోసారి పిలిస్తే ‘చీరే’స్తాం!

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

బద్వేలు అర్బన్‌: ‘ఏరుదాటే దాకా ఓడమల్లన్న ... దాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో నియోజకవర్గ వ్యాప్తంగా గల 12 క్లస్టర్లలో మహానాడు నిర్వహణ బాధ్యతను డీసీసీబీ చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి చేతికి అధిష్టానం అప్పగించింది. దీంతో ఎలాగైనా కార్యక్రమానికి జనాన్ని రప్పించి విజయవంతం చేయాలని అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలో బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన మూడు క్లస్టర్లలో మహిళలను రప్పించేందుకు మెప్మా ఆర్‌పీల ద్వారా వాయిస్‌ మెసేజ్‌లు పంపించారు. ప్రతి గ్రూపు నుంచి కచ్చితంగా ఐదుగురు మహిళలు హాజరు కావాలని, హాజరైన వారికి భోజన వసతితో పాటు చివరి రోజున చీరలు పంపిణీ చేస్తారని సదరు సందేశంలో చెప్పారు. దీంతో ఆశపడిన పట్టణంలోని పలు పేద కాలనీలకు చెందిన మహిళలు సభకు హాజరయ్యారు. రెండు రోజులు కార్యక్రమాన్ని ముగించుకున్న టీడీపీ నాయకులు కొద్ది మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. చీరలు దక్కని చాలా మంది మహిళలు టీడీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. తమను ఆశపెట్టి కార్యక్రమం ముగిసిన తర్వాత చీరలు ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు మోసపూరిత మాటలతో పిలిస్తే ‘చీరే’స్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బద్వేలు మహానాడులో పచ్చ నేతల‘బోడిమల్లన్న’ రాజకీయం

ఆశ చూపి పిలిచారు.. అవసరం తీరాక మొండిచేయి చూపారు

Advertisement
 
Advertisement
Advertisement