మహానాడు.. ఫ్లాప్
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా భావించే ’మహానాడు’ జిల్లా వ్యాప్తంగా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాల కంటే, సభలో జనాన్ని నిలబెట్టుకోవడమే స్థానిక నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. అంతర్గత గ్రూపు రాజకీయాలు, సమన్వయ లోపం కారణంగా పసుపు పండుగ కాస్తా ‘మహా.. ఫ్లాప్’షోగా మిగిలిపోయింది. నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న విభేదాలు ఈ వేదికపై బహిర్గతం కావడంతో పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి.
విజయమ్మ, రితేష్ రెడ్డి వర్గం గైర్హాజరు
బద్వేల్ నియోజకవర్గంలో డిజిటల్ మహానాడు నిర్వహణ బాధ్యతలను స్థానిక డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డికి అధిష్టానం అప్పగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమను కాదని వేరే నేతకు ప్రాధాన్యత ఇవ్వడంపై నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అసంతృప్తితో ’కినుక’ వహించారు. వీరిద్దరితో పాటు వారి అనుచర వర్గం, ప్రధాన క్యాడర్ మొత్తం మహానాడు కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉండిపోయింది.
డ్వాక్రా మహిళల సమీకరణ విఫలం
ఎలాగైనా మహానాడును విజయవంతం చేసి అధిష్టానం దృష్టిలో పడాలని డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. ఇందుకోసం డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించేందుకు స్కెచ్ వేశారు. ఆర్పీల ద్వారా మహిళల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపిస్తూ.. సభకు కచ్చితంగా హాజరు కావాలని ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ మహిళలు, స్థానిక జనం ఆశించిన స్థాయిలో సభకు రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
● ముందే అరకొరగా హాజరైన కొద్దిపాటి జనాన్ని సభలో కూర్చోబెట్టాలనే ఆత్రుత నిర్వాహకుల్లో అధికంగా కనిపించింది. వచ్చిన జనం కూడా బోర్ కొట్టి జారిపోతుండటంతో డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి ఒక ’సరికొత్త’ మార్గాన్ని వెతికారు. ఒకవైపు డిజిటల్ స్క్రీన్‌పై టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అగ్రనేతలు మహానాడు వేదికపై గంభీర ప్రసంగాలు చేస్తుండగా, అదే వేదికపై భారీ స్క్రీన్ ముందే అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. ఈ వింత పరిణామంతో తొలిరోజు నెట్టుకొచ్చిన ఆయన రెండవ రోజు స్వంత మండలాన్ని నుంచి కాస్త జనాన్ని పోగుచేసుకోవడం విశేషం.
సోషల్ మీడియాలో ట్రోల్స్
బద్వేల్ మహానాడు ఇప్పుడు రాజకీయ చర్చ కంటే.. ఈ రికార్డింగ్ డ్యాన్సుల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సభకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు. ‘అదిరిందయ్యా సూర్యం’ అంటూ మీమ్స్, ట్రోల్స్‌తో పసుపు తమ్ముళ్ల పరువును బజారున పడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పులివెందుల, కడప, మైదుకూరు, కమలాపురం, రాజంపేట, జమ్మలమడుగులల్లో సైతం కన్పించింది.
మహానాడు విక్షీంచిన సీఐ చల్లనిదొర
మహానాడులో రాజభక్తి ప్రదర్శించేందుకు అధికా రులు ఉత్సాహం చూపారు. రాజకీయ వేదికలో అధికారులు పాల్గొని ప్రసంగాలు వీక్షించారు. ఈ వింత పరిణామం జిల్లా వ్యాప్తంగా చాటుమాటుగా సాగించగా, కొంతమంది బాహాటంగానే ఉండిపోయారు. అలాంటి పరిస్థితి పెండ్లిమర్రి కేంద్రంగా తెరపైకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో పాటు సీఐ చల్లనిదొర డిజిటల్ మహానాడులో పాల్గొన్నారు. అగ్రనేతల ప్రసంగాలను వీక్షించారు. జిల్లాలో కొంతమంది అధికారులు తెరచాటుగా ఉండిపోగా, సీఐ బహిరంగంగా ప్రత్యక్షమవడం విశేషం.
క్లస్టర్లు ఎక్కువ.. జనాలు తక్కువ
డీసీసీబీ చైర్మన్ ‘సూర్యం’ సరికొత్త ఐడియా
పసుపు పండుగ వేదికపై రికార్డింగ్ డ్యాన్సులు
బద్వేల్‌లో రచ్చకెక్కిన తమ్ముళ్ల విభేదాలు
డ్వాక్రా మహిళల కోసం ఆర్పీలతో మెసేజ్‌లు పంపినా ముఖం చాటేసిన జనం
కార్యక్రమాన్ని మమ అన్పించిన తెలుగుతమ్ముళ్లు


