కడప సెవెన్‌రోడ్స్: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేయడం వంటి నిర్ణయాలు సామాజిక మార్పునకు దోహదపడ్డాయని తెలిపారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఎన్టీఆర్ జీవితం క్రమశిక్షణ, పట్టుదల, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిందని, నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.అనంతరం డీఆర్వో మల్లికార్జునుడు, స్టెప్ సీఈఓ జోయల్ విజయ్ కుమార్ ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


