పులివెందుల/వేముల : ప్రకృతి ప్రకోపానికి గురై, అకాల గాలివానల వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణమే మానవత్వంతో స్పందించి ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. వేముల మండలంలోని మీదిపెంట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి తోటలను వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌ఛార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిలతో కలిసి గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నేలకొరిగిన తోటలను చూసి చలించిపోయిన ఎంపీ, బాధితులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బలవంతంగా ప్రీమియం కటింగ్..
తీరా చూస్తే సాంకేతిక సాకులు!
ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా అనేది రైతుల హక్కు అని, బీమా సంస్థ బాధ్యత తీసుకుని నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులకు ఇష్టం లేకపోయినా.. 2025లో పంట రుణాలు పొందిన ప్రతి రైతు వద్ద ఎకరాకు రూ. 3,000ల చొప్పున, హెక్టారుకు రూ. 7,560ల చొప్పున బ్యాంకులు బలవంతంగా ప్రీమియం సొమ్మును కట్ చేసి రుణాలు రెన్యువల్ చేశారన్నారు. వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు ఈ విధంగా ప్రీమియం చెల్లించారని, దీని కవరేజీ 2025 జూలై నుంచి 2026 మే వరకు వర్తిస్తుందని గుర్తుచేశారు. కళ్లముందే ఇన్సూరెన్స్ గడువు ఉన్నప్పటికీ, సాంకేతిక సాకులు చూపడం అత్యంత దారుణమన్నారు.
వెదర్ స్టేషన్లు పనిచేయనప్పుడు నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?
వాతావరణ బీమా అంటేనే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా వర్షపాతం, గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకుని బీమా అందించాల్సి ఉంటుందని ఎంపీ వివరించారు. కానీ జిల్లాలో వెదర్ స్టేషన్లు చాలా చోట్ల సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ‘మరి పంటల బీమాకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి రైతుల వద్ద ప్రీమియం వసూలు చేశారు?‘ అని అధికారులను నిలదీశారు. ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహించొద్దని, మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యత వహించి తప్పనిసరిగా ప్రతి రైతుకూ బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు.
లింగాల మండల అనుభవాన్ని గుర్తుచేసిన ఎంపీ
గత మార్చి (2025)లో కూడా దాదాపు 1,200 ఎకరాలలో లింగాల మండలంలో గాలివానతో అరటి పంట దెబ్బతిని భారీ నష్టం సంభవించిందని ఎంపీ గుర్తుచేశారు. ఆ సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా తోటల వద్దకు వెళ్లి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారన్నారు. ఆ రోజు కూడా కేవలం రెండు వెదర్ స్టేషన్లలో మాత్రమే గాలి వేగం నమోదైందని, మిగతా చోట్ల ఎక్కడ నష్టం వాటిల్లిందో అక్కడ వెదర్ స్టేషన్లు పనిచేయలేదని గుర్తుచేస్తూ వ్యవస్థల లోపాలను ఎండగట్టారు.
మార్కెట్‌లో ధరలున్నా..
ప్రకృతి దెబ్బతో చేతికొచ్చిన పంట నేలపాలు!
ప్రస్తుత మార్కెట్ ధరల వ్యత్యాసాన్ని వివరిస్తూ.. ‘గత ఏడాది ఇదే మార్చి మాసంలో కేజీ అరటి కాయలు రూ. 2 నుంచి రూ. 3 మించి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం మార్కెట్ ధరలు సంతృప్తికరంగా ఉన్నాయి. బెంగుళూరు మార్కెట్‌కు పోతే అక్కడ ఏ సూపర్ మార్కెట్‌లో చూసినా కేజీ రూ. 30ల నుంచి రూ. 40లకు కొనాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో ధరలు బాగున్నా, ప్రకృతి ప్రకోపానికి చేతికి అందివచ్చిన పంట నేలపాలై రైతులు నష్టపోయారు‘ అని ఆవేదన వ్యక్తం చేశారు. అటి రైతుల పట్ల ప్రభుత్వం ఇప్పటికై నా మానవత్వంతో ముందుకొచ్చి ఇన్‌పుట్ సబ్సిడీని పెంచడంతో పాటు, పంటల బీమా త్వరితగతిన అందేలా చూసి అన్నదాతలను ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వెదర్ స్టేషన్లు పనిచేయకపోయినా
రూ. వేలల్లో ప్రీమియం వసూలు చేయడం అన్యాయం
రైతుల వద్ద బలవంతంగా ఎకరాకు రూ. 3 వేలు, హెక్టారుకు రూ. 7,560ల చొప్పున కట్ చేశారు
బీమా సంస్థే పూర్తి బాధ్యత వహించాలి
మీదిపెంట్లలో దెబ్బతిన్న
అరటి తోటలను పరిశీలించిన
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


