త్యాగం చేసే అవకాశం భక్తునికి వరం | - | Sakshi
Sakshi News home page

త్యాగం చేసే అవకాశం భక్తునికి వరం

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రపంచ ముస్లిం లోకం అత్యంత పవిత్రంగా భావించే ఈద్‌ ఉల్‌ జుహా పండుగ (బక్రీద్‌) ను గురువారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు 12 గంటల వరకు కొనసాగాయి. పలువురు భక్తులు తమ సమీపంలోని మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొనగా, అధికశాతం మంది ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

బిల్టప్‌ ఈద్గాలో

కడపలోని బిల్టప్‌ వద్దగల ఈద్గాలో నగర వాసులతోపాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా మత గురువు ముఫ్తీ మహమ్మద్‌ న్యామతుల్లా పండుగ సందేశమిస్తూ దేవుడు మానవుని త్యాగగుణాన్ని పరిశీలించడమే పండుగ పరమార్థం అన్నారు. దైవం భక్తులకు కఠినమైన పరీక్షలు పెడతారని, అందులో నెగ్గిన వారికి మంచి జీవితం ప్రసాదిస్తారని తెలిపారు. భక్తులు అల్లాహ్‌ మార్గాన్ని అనుసరించి ఆయన ఇచ్చిన ఈ ప్రాణాన్ని ఆయన మార్గంలో సమర్పించేందుకు ఏమాత్రం వెనుకాడకూడదని, అలాగే మనిషిలోని చెడు గుణాలను కూడా వదిలి వేయాలని చెప్పారు. త్యాగానికి ప్రతీకగా ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం అల్లాహ్‌ ఆదేశాన్ని పాటించిన సంఘటన గురించి వివరించారు. అలాగే మనుషుల్లో త్యాగ గుణం పెరగాలని, దైవం పేరిట త్యాగం చేయడంతోపాటు సాటి మనుషులతో పరస్పరం సహకరించుకుంటూ ఉన్నప్పుడే ప్రశాంత జీవనం, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌ షా ఆరిఫుల్లా హుసేని సాహెబ్‌ భక్తులచే సామూహిక ప్రార్థనలు చేయించారు. భక్తులు ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్‌ ముబారక్‌ హో’అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దదర్గా ప్రతినిధులు, నగర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.ప్రార్థనలకు వచ్చిన ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ సామూహిక ప్రార్థనలు

Advertisement
 
Advertisement
Advertisement