కడప అర్బన్ : వేంపల్లి టౌన్, గాజులపేట కాలనీకి చెందిన పాలా నాగార్జున, రమాదేవిల కుమార్తె పాలా వైష్ణవి (16) చెన్నూరు మండలం, రుద్రభారతిపేటలోని తన బంధువుల ఇంటికి 20 రోజుల క్రితం వచ్చింది.ఈనెల 25 వ తేదీ మధ్యాహ్నం 2.00 గంటల నుండి తన కుమార్తె కనిపించకుండా పోయిందని, ఆమె ఆచూకీ తెలియడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.
వేధింపుల కేసు నమోదు
ముద్దనూరు : అదనపు కట్నం కోసం భార్యను వేధించిన రామ్మోహన్ అనే వ్యక్తితో పాటు మరొకరిపై గురువారం కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ముద్దనూరుకు చెందిన స్వప్నకు గతేడాది ఫిబ్రవరిలో చెన్నారెడ్డిపల్లెకు చెందిన రామ్మోహన్‌తో వివాహమైంది. కొంత కాలంగా అదనపు కట్నం కోసం రామ్మోహన్ తన భార్యను వేధించేవాడు. వీటిని భరించలేక గురువారం స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మోహన్‌తో పాటు మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లారీని ఢీకొన్న కారు:
ముగ్గురికి గాయాలు
కేవీపల్లె, మే 28 : మండలంలోని గ్యారంపల్లె సమీపంలో గురువారం తెల్లవారిజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన లావణ్య, సుజన, డ్రైవర్ సంపత్‌తో కలిసి కారులో అరుణాచలం పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో గ్యారంపల్లె వద్దకు రాగానే కారు అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవగా, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురు జూదరులు అరెస్టు
తొండూరు : మండలంలోని ఇనగలూరు సమీపంలోని ముళ్లపొదల్లో జూదమాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఘనమద్దిలేటి తెలిపారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.


