మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా | - | Sakshi
Sakshi News home page

మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

పుంగనూరు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు కలసి పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా , రాస్తారోకో నిర్వహించిన సంఘటన సోమల పోలీస్‌స్టేషన్‌ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపల్లెకి చెందిన రామ్‌చరణ్‌(21) అనే యువకుడు ఈనెల 19న రాత్రి నంజంపేట నుంచి రాంపల్లెలోని తన ఇంటికి వెళ్తుండగా అతివేగంగా ఎదురుగా వస్తున్న టాటాఏసి వాహనం రామ్‌చరణ్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామ్‌చరణ్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గ్రామస్తులు , కుటుంబ సభ్యులు కలసి ఆ యువకుడికి వైద్యచికిత్సలు అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతి నుంచి సోమలకు తరలించారు. మార్గ మధ్యంలోని సోమల పోలీస్‌స్టేషన్‌ వద్ద అంబులెన్స్‌లో మృతదేహాన్ని పెట్టి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి హుటాహుటిన సోమలకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement