విద్యాకానుకకు కూటమి గ్రహణం! | - | Sakshi
Sakshi News home page

విద్యాకానుకకు కూటమి గ్రహణం!

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

● జిల్లా కేంద్రానికి చేరని వస్తువులు

ఎర్రగుంట్ల: జిల్లాలో వచ్చే జూన్‌ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడులు తెరుచుకోవడానికి కేవలం 16 రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ, విద్యార్థులకు అందించాల్సిన విద్యా కానుక కిట్లు ఇంతవరకు ఆయా మండల కేంద్రాలకు పూర్తి స్థాయిలో చేరలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు కిట్లు సకాలంలో అందుతాయో లేదోననే ఆందోళన జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్రంగా వ్యక్తమవుతోంది.

నాడు జగనన్న హయాంలో

ముందే అందిన కిట్లు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. ’జగనన్న విద్యా కానుక’ పథకం కింద ఐదేళ్లపాటు ప్రతి ఏటా పాఠశాలలు తెరిచే మొదటి రోజే విద్యార్థుల చేతికి కిట్లు అందేలా అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

ముందస్తు ప్రణాళిక

జగనన్న హయాంలో విద్యాసంవత్సరం ముగియక ముందే (మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే) ఇండెంట్లు సేకరించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేవారు. బడులకు వేసవి సెలవులు ఉన్నప్పుడే, మే నెలాఖరు నాటికి వంద శాతం నాణ్యమైన స్కూల్‌ బ్యాగులు, మూడు జతల యూనిఫాం వస్త్రాలు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, నోట్‌బుక్స్‌, నెక్సస్‌ బూట్లు, సాక్స్‌, బెల్టులను అన్ని మండల కేంద్రాల స్టాక్‌ పాయింట్లకు చేరవేసేవారు.

మొదటి రోజే పండుగలా పంపిణీ

జూన్‌ 1వ తేదీ నాటికే ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తరగతుల వారీగా కిట్లను సిద్ధం చేసేవారు. జూన్‌ 12న బడి తెరిచిన తొలిరోజే సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో విద్యార్థులందరికీ ఒకేసారి కిట్లను అందజేసేవారు. ఎక్కడా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఐదేళ్లపాటు ఈ విద్యా యజ్ఞం దిగ్విజయంగా సాగింది.

నేడు వందశాతం నోటు పుస్తకాలే.. మిగిలినవి ఎప్పుడు?

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ ముందస్తు ప్రణాళిక కరువైందనే విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా.. ప్రస్తుతం విద్యాకిట్లలో నోటు పుస్తకాలు వందశాతం రాగా, పాఠ్య పుస్తకాలు 75 శాతం వరకు వచ్చాయని తెలిపారు. అలాగే యూనిఫాంలు కూడా 100 శాతం మండల కేంద్రాలకు చేరుకున్నాయని వివరించారు. మిగిలిన వస్తువులు (షూస్‌, సాక్స్‌, బెల్టులు, బ్యాగులు) ఇంకా రావాల్సి ఉందని, దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.

● ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను ఆయా పాఠశాలలకు పంపించే ప్రక్రియను ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. నాడు జగనన్న హయాంలో లాగే ఈ ఏడాది కూడా పాఠశాలలు తెరిచే నాటికి మిగిలిన వస్తువులన్నీ అందించి, ఒకే కిట్‌గా పంపిణీ చేయాలని, ప్రభుత్వం ఇప్పటికై నా నిద్ర మత్తు వీడి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

బడి తెరిచేందుకు మిగిలింది 16 రోజులే

మండల కేంద్రాల్లో అసంపూర్తిగా నిల్వలు

నేటికీ అందని షూస్‌, సాక్స్‌,బెల్టులు, బ్యాగులు

నాడు మే నెలలోనేవంద శాతం కిట్లు సిద్ధం చేసినజగనన్న ప్రభుత్వం

నేడు ముందస్తు ప్రణాళికకరువైందని విద్యార్థులు,తల్లిదండ్రుల ఆందోళన

జిల్లాలో వేల సంఖ్యలో విద్యాకానుక కిట్లు అవసరమవుతాయి. ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు పంపిన నివేదికల మేరకు ప్రభుత్వం వీటిని సరఫరా చేయాల్సి ఉంది. విద్యా కిట్లలో స్కూల్‌బ్యాగ్‌, యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్ట్‌, డిక్షనరీ, వర్క్‌ పుస్తకాలు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఉండాలి. కానీ, ఇంతవరకు ఏ ఒక్క మండలానికి కూడా వంద శాతం పూర్తి స్థాయి వస్తువులతో కూడిన కిట్లు సరఫరా కాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తువులు విడివిడిగా వస్తుండటం, కొన్ని ముఖ్యమైన వస్తువులు అసలు రాకపోవడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement