బక్రీద్‌ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ శుభాకాంక్షలు

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

బక్రీద్‌ శుభాకాంక్షలు డీఏ ప్రకటించాలి దరఖాస్తుల ఆహ్వానం జూన్‌ 1 నుంచి పద్యపఠన, వక్త్తృత్వ పోటీలు 3న జాతీయ పంచాయత్‌ అవార్డుల ప్రదానం బొల్లవరం ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చేయండి

కడప అర్బన్‌: మత సామరస్యానికి ప్రతీక అయిన వైఎస్సార్‌ కడప జిల్లాలో బక్రీద్‌ పండుగను శాంతియుత వాతావరణంలో, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆకాంక్షించారు. సమైక్యతను, సమానత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండుగ సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులకు, పోలీస్‌ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు కానీ, ఏ చిన్న సమస్య ఉన్నా డయల్‌ 112 కి గాని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.

కడప ఎడ్యుకేషన్‌: బహిరంగ మార్కెట్‌లో పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలలో తక్షణం ఒక డీఏను ప్రకటించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎం.షరీఫ్‌ ఒక ప్రకటనలో కోరారు. జులై 2024 నుంచి 4 డీఏలు పెండింగ్‌ లో పెట్టి, కనీసం పీఆర్శీ కమిషన్‌ను కూడా నియమించక పోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం వల్ల ప్రభుత్వం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఉన్న కస్తూర్బా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద(కాంట్రాక్టు) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌, సమగ్రశిక్ష ఏపీసీ బి. అనుఽరాధలు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026–27 విద్యా సంవత్సరానికి గాను చేపట్టనున్నట్లు తెలిపారు. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు తదితరల వివరాలు http:IIkgbvrecruitment.apcfss.in వెబ్‌సైట్‌ సందర్శించాలని తెలిపారు. దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 7075039990, 79933299115 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో వేసవి సెలవుల సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం జూన్‌ నెల 1 నుంచి 3వ తేదీ వరకు పద్యపఠన, వక్త్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. ఈ పోటీలు ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 1వ తేదీన 3, 4, 5 తరగతి విద్యార్థులకు పద్యపఠన పోటీ (ఏవైనా 3 వేమన పద్యాలు, ఏవైనా 3 సుమతీ పద్యాలు), 2వ తేదీన 6, 7, 8 తరగతి విద్యార్థులకు ‘తెలుగు భాష మాధుర్యం’ అనే అంశంపై వక్తృత్వ పోటీ, 3వ తేదీన 9,10 తరగతి విద్యార్థులకు ‘నాకు నచ్చిన పుస్తకం’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని తెలిపారు.

కడప సెవెన్‌రోడ్స్‌: జాతీయ పంచాయతీ అవార్డుల–2025 ప్రధాన కార్యక్రమం జూన్‌ 3వ తేది ఢిల్లీలోని భరత్‌ మండపంలో నిర్వహించనున్నారు. పేదరిక నిర్మూలన, జీవనోపాదుల పెంపు కింద ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె గ్రామ పంచాయతీ ఎంపికై ంది. దీని తరుపున అవార్డు స్వీకరించేందుకు వెళుతున్న అధికార ప్రతినిధి బృందంలో జెడ్పీ సీఈఓ సి.సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకట సుబ్బయ్య, కడప డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పి.మైథిలి, డివిజనల్‌ పంచాయతీ అధికారి జి.విజయభాస్కర్‌, ఖాజీ పేట ఎంపీడీఓ ఎస్‌.దివిజ, చెమ్ముళ్లపల్లె పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ జి.శివకుమార్‌లు ఉన్నారు.

ప్రొద్దుటూరు: మున్సిపాలిటీ పరిధిలోని బొల్లవరం ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనా తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్‌ ఆఫీసర్‌ రెవెన్యూ రీ సర్వే, జనగణనపై ఇన్‌చార్జి అధికారులైన మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్‌ ఉదయ భాస్కర్‌ రాజుతో మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చేపడుతున్న ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రికార్డులను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement