త్యాగమయ జీవితం.. బక్రీద్‌ సందేశం | - | Sakshi
Sakshi News home page

త్యాగమయ జీవితం.. బక్రీద్‌ సందేశం

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

నేడు ఈద్‌–ఉల్‌–జుహా (బక్రీద్‌)

జిల్లాలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

కడప సెవెన్‌రోడ్స్‌/ రాజంపేట టౌన్‌ : ముస్లిం లోకం అల్లాహ్‌కు మించిన ప్రపంచం లేదని గాఢంగా విశ్వసిస్తుంది. ఆయన మాటలను, దూతల ఆదేశాలను శాసనంగా భావించి కచ్చితంగా పాటించేందుకు సిద్ధమవుతుంది. వారి పండుగల్లో బక్రీద్‌ ఒకటి. త్యాగమయ జీవితమే మానవ జన్మకు సార్థకమన్న అల్లాహ్‌ ఆదేశాలు పాటించేందుకు ఎంతటి త్యాగానికై నా సిద్ధం కావడమే ఈ పండుగ ఉద్దేశ్యం.

కడప నగరంలో..

బక్రీద్‌ పండుగ సందర్భంగా గురువారం నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం కడప నగరంలో మసీదులు, ఈద్గాలలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర శివార్లలోని బిల్టప్‌, దండుతోపాటు ఇతర ఈద్గాలు, జిల్లాలోని వేలాది మసీదుల్లో గురువారం ప్రార్థనల నిర్వహణకు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా కడప నగరంలోని బిల్టప్‌ ఈద్గా వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు చేసుకునేందుకు ఈద్గా ప్రాంగణమంతా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రార్థనలు ముందు వజూ చేసుకునేందుకు మంచినీరు అందుబాటులో ఉంచారు. ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు. విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని వివిధ మసీదుల్లో భక్తుల సౌకర్యార్థం ప్రార్థన సమయాలను నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ సందేశం ఇవ్వనున్నారు.

త్యాగనిరతికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్‌ పండుగను గురువారం ఘనంగా జరుపుకునేందుకు ముస్లీంలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం జిల్‌హిజ మాసంలోని (చంద్రోదయం ఆధారంగా) పదవ తేదీ బక్రీద్‌ పండుగను జరుపుకుంటారు. ఈసదంర్భంగా ముస్లీంలు మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి బంధుమిత్రులను కలిసి శుభాకాంక్షలు చెబుతారు. రంజాన్‌ సందర్భంగా దానాలు చేసే ముస్లీంలు బక్రీద్‌ రోజున ఖుర్బానీ ఇస్తారు.

ఇది బక్రీద్‌ నేపథ్యం...

ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో తన కుమారుడిని త్యాగం చేస్తున్నట్లు కల వస్తుంది. ఇలా మూడుమార్లు కల రావడంతో ఇదే విషయాన్ని తన కుమారుడు ఇస్మాయిల్‌కు చెబుతాడు. హజ్రత్‌ దైవ విశ్వాసి కావడంతో ఇస్మాయిల్‌ నిస్సంకోచంగా అందుకు అంగీరించి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాడు. దైవానుగ్రహం కోసం కుమారుడిని సైతం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం త్యాగనిరతిని, దైవంపై ఉన్న అచంచల విశ్వాసానికి అల్లా ప్రసన్నమవుతారు. కుమారుడిని ఖుర్బానీ ఇచ్చే సమయంలో స్వర్గం నుంచి ఓ గొర్రెను తెచ్చి ఆ ప్రదేశంలో ఉంచుతారు. దీంతో అల్లా ఆదేశం ప్రకారం ఖుర్బానీ సంపూర్ణమవుతుంది. ఈ చారిత్రక ఘటన నేపథ్యంలో మహా ప్రవక్త హజ్రత్‌ మొహమ్మద్‌ నిర్దేశం మేరకు ముస్లీంలు ప్రతి ఏటా బక్రీద్‌ పండుగను జరుపుకుంటున్నారు.

ఖుర్బానీ..

బక్రీద్‌ సందర్భంగా ముస్లీంలు ఖుర్బానీ ఇవ్వడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఖుర్బానీ ఇచ్చిన జంతువు మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఒక భాగాన్ని పేదలకు, రెండవ భాగాన్ని బంధు, మిత్రులకు, మూడవ భాగాన్ని తమకోసం ఉంచుకుంటారు. ఇందులో ఏమాత్రం వ్యత్యాసం రాకూడదు.

హజ్‌యాత్ర..

ఇస్లాం ప్రాథమిక ఐదు సూత్రాలలో మొదటిది దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, మహమ్మద్‌ ప్రవక్తను దైవప్రవక్తగా విశ్వసించడం. రెండవది ప్రతి ముస్లీం ఐదుపూటల నమాజ్‌ను విధిగా ఆచరించడం. మూడవది రంజాన్‌ మాసంలో ముప్‌పై రోజులు ఉపవాసం ఉండటం.

నాల్గవది ధనవంతులు తమ సంపదలో రెండున్నర శాతం రంజాన్‌ మాసంలో పేదలకు, అనాధలకు, వితంతువులకు జకాత్‌ ఇవ్వడం. ఐదవది మక్కా యాత్ర చేయడం. ముస్లీంలు ఈ మాసంలోనే హజ్‌ యాత్ర చేస్తారు. ఈ మాసంలో పవిత్ర స్థలం మక్కాను సందర్శించడాన్ని ముస్లీంలు పుణ్యంగా భావిస్తారు. సౌది అరేబియాలోని మక్కాకు వెళ్ళి మస్జీద్‌ అల్‌ హరమ్‌లోని కాబా చుట్టూ ఏడుమార్లు ప్రదక్షిణ చేస్తారు.

బక్రీద్‌ నేపథ్యంలో పటిష్ట భద్రత

కడప అర్బన్‌ : కడప నగరంలోని వన్‌ టౌన్‌, టూ టౌన్‌, తాలూకా, సైబర్‌ క్రైమ్‌, సి.కె దిన్నె పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల కు సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన పిటిషనర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత సీఐ లను ఆదేశించారు.

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా స్టేషన్లలో సిబ్బంది వివరాలు, పనితీరు అడిగి తెలుసుకున్నారు. బక్రీద్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా పై నిఘా ఉంచాలని సైబర్‌ క్రైమ్‌ సీఐ మధుమల్లేశ్వర రెడ్డి ని ఆదేశించారు. తనిఖీల సమయంలో కడప వన్‌ టౌన్‌ సీఐ వి.చిన్న పెద్దయ్య, కడప టూ టౌన్‌ సీఐ శ్రీహరి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement