మైదుకూరు : మైదుకూరు పోలీసులు రెండు వేర్వేరు సంఘటనల్లో రూ.20లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, 7 బైక్‌లను చోరీ చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో ఆ వివరాలను వెల్లడించారు. ఆ మేరకు.. ఈనెల 9వ తేదీన ప్రొద్దుటూరుకు చెందిన కంసల సుభాన్‌బీ అనే మహిళ తన బంధువు వివాహానికి శెట్టివారిపల్లెకు వచ్చి తిరిగి ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు మైదుకూరులో బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్‌లో ఉంచిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడలోని శాంతినగర్‌కు చెందిన బత్తుల సరోజ అనే మహిళా దొంగను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లాంగ్ చైన్, నల్లపూసల దండ, హారం, కమ్మలు తదితర రూ.15లక్షలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సరోజతోపాటు చోరీలో పాల్గొన్న చీరాలకు చెందిన తరుణ్ అనిల్ అలియాస్ డిమ్ము, మదన్ దొరకాల్సి ఉంది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట స్థానిక వనిపెంట రోడ్డులో ఓ మోటార్ బైక్ చోరీకి గురికాగా కేసు నమోదు చేసిన పోలీసులు మైదుకూరులోని సీపీఎం కాలనీకి చెందిన షేక్ నన్నేబాయ్ అనే యువకుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5లక్షలు విలువైన 7 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రెండు సంఘటనల్లో దొంగలను పట్టుకునేందుకు, చోరీకి గురైన బంగారు ఆభరణాలు, బైక్‌లను రికవరీ చేసేందుకు కృషి చేసిన అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్‌ఐలు కె.చిరంజీవి, కె.వెంకటరమణ, సిబ్బందిని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించి వారికి రివార్డులను అందజేశారు.
రూ.20 లక్షల విలువైన బంగారు
ఆభరణాలు, 7 బైక్‌లు స్వాధీనం


