బద్వేల్‌లో పీక్‌కు చేరిన విభేదాలు.. ‘రితేష్‌రెడ్డి’ని పక్కనబెట్టుడు!
మినీ మహానాడుకు కాదేదీ అనర్హం!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘వర్చువల్ మహానాడు’ జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌కు పెద్ద శిరోభారంగా మారింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో సాగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధిష్టానం నుంచి హుకుం జారీ కావడంతో స్థానిక నేతలు మల్లాగుల్లాలు పడుతున్నారు.
78 క్లస్టర్లు.. భారీ ఖర్చులు
ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా 40 మండలాలు, 9 మున్సిపాలిటీలను కలిపి మొత్తం 78 క్లస్టర్లుగా విభజించారు. జిల్లా కేంద్రమైన కడపలోనే ఏకంగా 14 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌లో కార్యకర్తలు వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, భోజన వసతులు కల్పించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే, ఈ భారీ వ్యయాన్ని భరించలేక, అటు ఎమ్మెల్యేలు లేదా ఇన్‌ఛార్జ్‌లను డబ్బులు అడగలేక.. స్థానిక కేడర్ తీవ్ర అసహనం, అనాసక్తి వ్యక్తం చేస్తోంది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మాజీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిల మధ్య ఉన్న తీవ్రస్థాయి విభేదాల వల్ల కార్యక్రమ నిర్వహణపై పరిశీలకులు మల్లాగుల్లాలు పడుతున్నారు.
పరిశీలకుల పర్యవేక్షణ...
సగానికి పైగా మండలాలు వెనుకడుగు
వర్చువల్ మహానాడు నిర్వహణకు నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని అధిష్టానం నియమించింది. క్షేత్రస్థాయి ఏర్పాట్లపై పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం దృష్టికి వెళ్తోంది. అయితే, ఇప్పటికి సగానికి పైగా మండలాలు కనీసం స్క్రీన్‌లు కూడా బుక్ చేసుకోలేదు. 78 క్లస్టర్ల పరిధిలో డిజిటల్ మహానాడు నిర్వహణ అత్యంత కష్టతరంగా మారినట్లు పరిశీలకులు గుర్తించారు. అన్ని ప్రాంతాల్లో ఇది విజయవంతం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పరిశీలకులు ఇన్‌ఛార్జీలతో అత్యవసర సమాలోచనలు జరుపుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన ‘మినీ మహానాడు’ సమావేశాల వేది కల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని మద్రాసు రోడ్డులో ఉన్న పవిత్ర ధార్మిక సంస్థ టీటీడీ కళ్యాణమండపాన్ని, మినీ బైపాస్‌లోని గురుకుల్ విద్యాపీఠ్ పాఠశాలను ఈ రాజకీయ వేడుకల కోసం ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించాల్సిన ధార్మిక వేదిక ల్లో, చిన్న పిల్లలు చదువుకునే విద్యాసంస్థల్లో పచ్చ జెండాలు కట్టి హంగామా చేస్తుండటంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. –కడప కార్పొరేషన్
మరోవైపు బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి వీరారెడ్డి రాజకీయ వారసుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న రితేష్‌రెడ్డిని పార్టీ ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ కింద పక్కన పెట్టేసిందనే చర్చ సాగుతోంది. రితేష్‌రెడ్డితో ఎలాంటి నిమిత్తం లేకుండానే, డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డికి వర్చువల్ మహానాడు నిర్వహణ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఈ పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. మాజీ మంత్రి వీరారెడ్డి అనుచరులంతా మహానాడుకు గైర్హాజరు కావాలనే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అట్లూరు నుంచి భారీగా సమీకరణ చేపట్టి మహానాడు సక్సెస్ చేయాలనే దిశగా డీసీసీబీ చైర్మన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రితేష్‌రెడ్డి పట్ల అసమ్మతి నేతలందర్నీ వేదికపైకి తీసుకువచ్చే దిశగా మంతనాలు ఆరంభించినట్లు సమాచారం.
వర్చువల్ మహానాడుకు వ్యయం తడిసిమోపెడు
ఖర్చులకు వెనుకంజ వేస్తున్న తమ్ముళ్లు!
78 క్లస్టర్లలో నిర్వహణ కష్టతరం
బద్వేల్‌లో రితేష్‌రెడ్డిపై ‘యూజ్ అండ్ త్రో’ పాలిటిక్స్!


