● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప కోటిరెడ్డిసర్కిల్: ఖాతాదారులకు విశిష్టమైన, మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని రాజీవ్ మార్గ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‘ ఎర్రముక్కపల్లె బ్రాంచ్ కార్యాలయాన్ని వైవీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్, యూబీఐ రీజినల్ మేనేజర్ లక్ష్మితులసిలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా ప్రజలకు లావాదేవీలు మాత్రమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను లబ్ధిదారులకు అందజేయడంలో పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఎర్రముక్కపల్లె బ్రాంచ్ మేనేజర్ భాను తేజ, ఎల్‌ఐసీ బ్రాంచ్ మేనేజర్ రవీంద్రా రెడ్డి, వివిధ శాఖల బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
‘సర్’ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి
కడప సెవెన్‌రోడ్స్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (సర్) నిర్వహణకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి సర్ నిర్వహణ, సన్నాహక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌తో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, డీఆర్వో, ఆర్డీవోలు, ఈఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ అమలు, చేపట్టాల్సిన సన్నాహక కార్యక్రమాలపై వారు అన్ని జిల్లాల కాలెక్టర్లతో సమగ్రంగా సమీక్షించారు.


