సిద్దవటం : కడప–చైన్నె జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం కడప– చైన్నె జాతీయ రహదారి కనుమలోపల్లి గ్రామ సమీపంలోని శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయం వద్ద శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముంబై నుంచి చైన్నెకి వెళ్తున్న పార్సిల్ లారీ ఢీకొన్నాయి. ఈ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా హైవే రోడ్డుపై శబ్దం రావడంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వీరిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ప్రయాణికులకు బలమైన గాయాలు తగినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలానికి రాజంపేట అర్బన్ సీఐ నాగార్జున, కడప తాలూకా సీఐ నరసింహరాజు, టీటీఆర్‌పీ సీఐ మహమ్మద్‌బాబీ, ఎస్‌ఐలు హారిక, శ్రీనివాసులు, తులసినాగప్రసాద్, హైవే పెట్రోలింగ్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. మండల ఎస్‌ఐ హారిక ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేస్తున్నారు.
పలువురికి గాయాలు


